‘మాస్టర్ ప్లాన్’ సెగ..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మాస్టర్ ప్లాన్ సెగ గట్టిగా తగులుతోంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని గతంలో ఉద్యమాలు చేసిన రైతులు.. ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తేనే, కామారెడ్డిలో అడుగు పెట్టనిస్తామని సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు రైతులు. కామారెడ్డి మున్సిపాలిటీలోని లింగాపూర్ గ్రామంలో సుమారు 200 మంది రైతులు సమావేశమయ్యారు. పార్టీలకతీతంగా రైతులంతా ఏకమై ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్‌పై 100 నామినేషన్లు దాఖలు చేస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామం నుంచి 15 మంది రైతులు నామినేషన్లు వేస్తారని చెప్పారు. నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవితపై పసుపు రైతులు అనుసరించిన వ్యూహాన్ని అనుసరించేందుకు సిద్ధమయ్యారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘మొన్న గజ్వేల్ కార్యకర్తలతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డిలో తనకు పని ఉండటం వల్లనే అక్కడికి వెళ్తున్నానని అన్నారు. కేసీఆర్‌కు ఇక్కడేం పని ఉంది? గజ్వేల్‌లో భూములు అయిపోయాయి, ఇక ఇక్కడికి ఆ పని మీదే వస్తున్నారా..?’ అని రైతులు ప్రశ్నించారు. రైతు రాములు ఆత్మహత్య లాంటి ఘటనలు పునరావృతం కాకముందే.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని ప్రకటించిన తర్వాతే కామారెడ్డికి రావాలని సూచించారు. గవర్నర్ ద్వారా మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
‘మాస్టర్ ప్లాన్ ఇంకా డ్రాఫ్ట్ కాలేదు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను అనవసరంగా బద్నాం చేస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ అసంబద్ధ మాటలు మాట్లాడారు. రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కామారెడ్డి మున్సిపల్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతోనే మేము ఉద్యమ బాట పట్టాం. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని రైతులు హెచ్చరించారు.
‘రైతులందరం పార్టీలకు అతీతంగా సంఘటితం అవుతున్నాం. 9 గ్రామాల్లో రైతులు, వారి బంధువులతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. 9 గ్రామాల్లోనే కాకుండా నియోజకవర్గం మొత్తం కలియతిరిగి ఓటర్ల కాళ్లు మొక్కైనా సరే.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతాం. మాకు మద్దతిచ్చే వారికే ఓటు వేస్తాం’ అని రైతులు అన్నారు.













