ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర.. భార్య సంచలన ఆరోపణలు..!
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎన్ని సంచలనాలకు కారణమైందో అందరికీ తెలుసు. ఈ ఉపఎన్నికలు ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలని అధికార బీఆర్ఎస్ ప్రయత్నించింది. అయితే అది వర్కవుట్ కాలేదు. అప్పటివరకూ కాంగ్రెస్ లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినా ఈటల ముందు నిలబడలేకపోయింది బీఆర్ఎస్. ఈటల రాజేందర్ పైన ఉపఎన్నికలో గెల్లు శ్రీనివాస్ పోటీ చేశారు. అయినా ఇక్కడ రాజకీయమంతా ఈటల రాజేందర్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి అన్నట్టు సాగుతోంది.
ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి గెలిచారు. అప్పటి నుంచి ఆయన్ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలనే కసి బీఆర్ఎస్ లో పెరిగిపోయింది. గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఎదుర్కోవడంలో గెల్లు శ్రీనివాస్ విఫలమయ్యారు. అందుకే ఈసారి ఈటలపైన పోటీగా పాడి కౌశిక్ రెడ్డిని దించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అందులో బాగంగానే హుజూరాబాద్ నియోజకవర్గ బాధ్యతలను కౌశిక్ రెడ్డికి అప్పగించారు. అప్పటి నుంచి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఈటల రాజేందర్ పై విమర్శలు గుప్పిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే కొన్నిసార్లు కౌశిక్ రెడ్డి కామెంట్స్ వివాదాలకు కారణమవుతున్నాయి.
కౌశిక్ రెడ్డి కొన్నిసార్లు పార్టీకి పెద్ద సమస్యగా మారారు. ఆయన నోటి దురుసుతనం వల్ల పార్టీ అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. నోరు జారడం, ఆ తర్వాత సారీ చెప్పడం కౌశిక్ రెడ్డికి అలవాటైపోయింది. ఇప్పుడు కౌశిక్ రెడ్డిపై ఈటల రాజేందర్ భార్య జమున సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ ను చంపేందుకు కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈటలను హతమార్చేందుకు 20 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తమకు తెలిసిందన్నారు. హూజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి అరాచకాలు సృష్టిస్తున్నారని, అతన్ని కేసీఆర్ ఎగదోస్తున్నారని జమున ఆరోపించారు. ఈటలను చంపేస్తామంటే భయపడబోమన్న జమున.. ఆయనకు ఏం జరిగినా కేసీఆర్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ఈటల రాజేందర్ బీజేపీలో సంతృప్తిగా లేరనే టాక్ వినిపిస్తోంది. ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారని కూడా చెప్తున్నారు. అంతేకాక బీఆర్ఎస్ నుంచి కూడా ఈటలకు ఆహ్వానం ఉందనే సమాచారం కూడా ఉంది. అయితే ఈ సమయంలో జమున మీడియా ముందుకొచ్చి ఈటల హత్యకు కుట్ర చేస్తున్నారంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. అది కూడా కేసీఆర్ టార్గెట్ గా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.













