హత్యారాజకీయాలు..?
హుజూరాబాద్ లో హత్యారాజకీయాలు నడుస్తున్నాయా? ఈటలను హత్య చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సుపారీ ఇచ్చారా? కాదు ఈటల.. గతంలో ఉద్యమకారులను అణిచివేసేవిధంగా ప్రవర్తించారా? ఏది నిజం? ఇప్పుడిదే అంశం హుజురాబాద్ ప్రజలతో పాటు బీఆర్ఎస్ శ్రేణుల్ని గందరగోళపరుస్తోంది. మరోవైపు….నయీంకే బెదరలేదు.. ఇలాంటి వాటికి జడిసేది లేదన్నారు ఈటల. ఈటల, కౌశిక్ రెడ్డి మధ్య అంతపగ ఉందా? లేక దీనివెనక బీఆర్ఎస్ పెద్దల హస్తముందా?
ఈటలను హత్య చేసేందుకు కౌశిక్ రెడ్డి కుట్ర పన్నారని ఈటల భార్య జమున ఆరోపించారు. దీనికోసం 20 కోట్ల రూపాయలతో డీల్ కుదుర్చుకున్నారన్నారు. ఈటలను చంపేస్తామని కౌశిక్ రెడ్డి అన్నారంటే అది కేసీఆర్ అండతోనే అని ఆరోపించారు.ఈటల రాజేందర్ ఏపార్టీలో ఉన్నా.. ఆయన ప్రజలకోసమే పనిచేస్తారన్నారు. తాను ఏరోజూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానన్న జమున.. ఈటలకు అండగా ఉంటానన్నారు. నీతి, నిజాయతీతో బతుకుతున్న ఈటలను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈటల జమున వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కౌంటరిచ్చారు. హత్యా రాజకీయాలు చేసే అలవాటు ఈటలకే ఉందన్నారు. ఆయన ఎంతోమంది ఉద్యమకారులను టార్చర్ పెట్టారన్నారు. అంతేకాదు 2001లో ఎంపీటీసీ బాల్ రెడ్డిని.. ఈటల హత్య చేయించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తాను ఆయనను చంపడం కాదు, ఆయనే తనను చంపిస్తారని భయంగా ఉందన్నారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చంపించేందుకు ఈటల కుట్ర చేసినట్లు కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి.. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ తో వెరిఫై చేయించాలన్నారు. కేంద్రం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో.. రాష్ట్రప్రభుత్వం తరపునే సెక్యూరిటీ ఇవ్వాలని సూచించారు.కేటీఆర్ ఫోన్ కాల్ తో ఈటల భద్రతపై డీజీపీ సమీక్ష చేపట్టారు. మరోవైపు.. ఈటల విషయంలో కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడంపైనా పొలిటికల్ సర్కిల్స్ లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.













