ఈటల ఏం చేయబోతున్నారు..?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈటల రాజేందర్ హాట్ టాపిక్ గా మారారు. భూఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలో సీఎం కేసీఆర్.. ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి భర్తరఫ్ చేశారు. ఆయన ఆక్రమణలపై ఉన్నతస్థాయి విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విచారణ కొనసాగుతోంది. అయితే కేబినెట్ నుంచి తొలగించడంతో ఈటల రాజేందర్ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. కేసీఆర్ బీఫాం ఇచ్చారు కాబట్టే గెలిచారు అంటారని.. అందుకే నియోజకవర్గ ప్రజలతో చర్చించి అవసరమైతే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే రాజీనామా చేసిన తర్వాత ఈటల ఏదైనా పార్టీలో చేరతారా.. లేకుంటే కొత్త పార్టీ పెడతారా.. అనే చర్చ జోరుగా సాగుతోంది.
రేపోమాపో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈటల రాజేందర్ ఇంకాస్త ఆలస్యం చేస్తే కేసీఆరే పార్టీ నుంచి బహిష్కరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయం ఈటలకు కూడా తెలుసు. అందుకే ఆయన తన నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, సన్నిహుతులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఓ విడత హైదరాబాద్ లో, మరోవిడత తన నియోజకవర్గం హుజూరాబాద్ లో చర్చలు జరిపారు. మరోవిడత అందరితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఈటల ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలను న్యాయస్థానంలోనే తేల్చుకుంటానంటున్న ఈటల.. ఆత్మగౌరవమే అస్తిత్వంలో పడిపోయిందంటున్నారు. ప్రాణాలైనా ఇస్తా కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోనని స్పష్టం చేస్తున్నారు.
ఈటల ముందు ఇప్పుడు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. ఒకటి ఇప్పటికే ఉన్న పార్టీలలో చేరడం. ఇందుకు రెండే ఆప్షన్లు. ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ. ఈటల వస్తానంటే ఈ రెండు పార్టీలూ స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా, మచ్చలేని వ్యక్తిగా ఈటలకు పేరుంది. అందుకే ఈటల వస్తానంటే చాలు.. స్వాగతం పలికేందుకు రెడీగానే ఉంటాయి. అయితే ఈటల రాజేందర్ ఈ పార్టీల్లో చేరతారా.. లేదా .. అనేది చెప్పలేం. రెండు పార్టీల్లోనూ ఈటలకు సన్నిహితులున్నారు. ఈటలపై ఇప్పటికే సానుభూతి చూపిస్తున్నారు. ఈటలను కేసీఆర్ వాడుకుని వదిలేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
ఇక రెండో ఆప్షన్ కొత్త పార్టీని పెట్టడం. చాలా మంది ఈటల పార్టీ పెడతారనే చెప్తున్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా ఈటల పార్టీని చీల్చేందుకు కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. ఈటల పార్టీ పెడతారనే టాక్ ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఒకవేళ ఈటల పార్టీ పెడితే ఆయనతో ఎవరెవరు వెళ్తారు.. టీఆర్ఎస్ నుంచి ఎవరైనా వెళ్తారా.. ఇతర పార్టీల నుంచి ఎవరైనా మద్దతు ప్రకటించే అవకాశం ఉంటుందా.. అనేవి చూడాల్సి ఉంది. టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తులు, ఇప్పటికే ఈ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొంతమంది నేతలు, టీజేఎస్ కోదండరాం, తీన్మార్ మల్లన్న లాంటి నేతలు ఈటలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉండొచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.!













