బీజేపీకి ఈటల రాజేందర్ షాక్ ఇవ్వబోతున్నారా..?
ఎన్నికలు దగ్గర పడేకొద్దీ తెలంగాణ బీజేపీలో అసమ్మతి రాగాలు ఎక్కువయ్యాయి. పార్టీ అధినేత బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ మధ్య దుమారం చెలరేగింది. ఇంతలో మరో నేత ఏకంగా బండి సంజయ్ ని మాఫియా లీడర్ గా పోల్చారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. ఇప్పుడు ఆ పార్టీలో కీలక నేత ఈటల రాజేందర్ తనకు అప్పగించిన బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హుజూరాబాద్ నుంచి బీజేపీ జెండాతో విజయం సాధించారు. అప్పటి నుంచి బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన ప్రాధాన్యతను, పలుకుబడిని గుర్తించిన బీజేపీ హైకమాండ్.. ఈటలకు చేరికల కమిటీని ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ గా నియమించింది. వివిధ పార్టీల నుంచి నేతలను ఆకర్షించడం ఈ కమిటీ బాధ్యత. మొదట్లో ఈటల రాజేందర్ చురుగ్గా పనిచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలను పార్టీలోకి తీసుకురాగలిగారు.
అయితే ఇప్పుడు పార్టీలో పరిస్థితులు మారాయి. ఈటల రాజేందర్ సహా పలువురు కీలక నేతలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదనే బాధ ఉంది. చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు పార్టీలో చేరే నేతలు తమకు పార్టీలో ఇచ్చే ప్రాధాన్యతపై ప్రశ్నిస్తున్నారు. దానికి ఈటల దగ్గర సమాధానం ఉండట్లేదు. రాష్ట్ర నాయకత్వం నుంచి సానుకూల స్పందన లభించట్లేదు. ఇలాంటి చిన్న విషయాలను హైకమాండ్ దగ్గరకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఈటల నలిగిపోతున్నట్టు తెలుస్తోంది.
అందుకే చేరికల కమిటీ ఛైర్మన్ పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పార్టీలో నేతల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. బహిరంగంగానే నేతలు విమర్శించుకుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈటల రాజీనామా చేస్తే పార్టీకి పెద్ద దెబ్బే. మరోవైపు ఈటల రాజేందర్ కు బీఆర్ఎస్ మళ్లీ గాలమేస్తోందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవలికాలంలో కేసీఆర్, కేటీఆర్, కవిత లాంటి నేతలు ఈటలను పొగుడుతూ కామెంట్స్ చేయడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.













