‘ఈటెల’లాంటి మాటల్తో.. భాజాపాపై ధ్వజం..
సాధారణంగా సాత్విక విమర్శలకే పరిమితమైన తెలంగాణ మంత్రి…ఈటెల రాజేందర్ ఈసారి మాత్రం గట్టిగానే విరుచుకుపడ్డారు. అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారంటూ భాజాపా అగ్రనేతలపై ఆగ్రహం వ్కక్తం చేశారు. ఇటీవల తెలంగాణలో కరోనా కేసుల విజృంభణపై ఢిల్లీలోని భాజాపా నేత జెపి నడ్డా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉందనడానికి ఈటెల మాటలు అద్దం పట్టాయి. ఆదివారం విలేకరుల సమావేశంలో ఈటెల మాట్లాడుతూ జెపి నడ్డా వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఏదైనా మాట్లాడితే ఆధారాలుండాలని ఎలా పడితే అలా మాట్లాడకూడదన్నారు. కరోనా అనేది ప్రపంచం అంతా ఎదుర్కంటున్న సమస్య అని మర్చిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కేసులు పెరగడానికి తాము కారణమైతే… అదే సూత్రం భాజాపా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందా అని నిలదీశారు.
గుజరాత్ స్వయంగా ప్రధాని మోడీ స్వరాష్ట్రమనీ అక్కడ తెలంగాణకు ఎన్నో రెట్లు ఎక్కువగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి కాబట్టి అక్కడ పరిస్థితికి మోడీ కారణమంటారా? అంటూ ప్రశ్నించారు. కష్టకాలంలో కేంద్రం నుంచి ఏరకంగానూ తమకు తగిన సాయం అందలేదేన్నారు తాము వేల సంఖ్యలో వెంటిలేటర్లు అడిగితే 50 ఇచ్చారని, పిపిఇ కిట్టు వగైరా విషయంలోనూ అంతే చేశారన్నారు. దీపాలు ఆర్పడం, పూలు చప్పట్లు కొట్టడం వంటి పిలుపులను పలు పార్టీలు అవహేళన చేసినా తమ నేత కెసియార్ మాత్రం మద్ధతు పలికారని గుర్తు చేశారు. భాజాపాకి తెలంగాణలో చిరునామా లేదని, ఇక్కడ ఆ పార్టీకి ఉన్నది కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమేనని చురకలంటించారు. తాము ఆదమరచి ఉండబట్టి భాజాపా ఏవో కొన్ని ఎంపీ సీట్లు గెలిచిందని దాంతో కోతికి కొబ్బరికాయ దొరికినట్టు సంబరపడిపోతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఒకటి రెండు ప్రాంతాలు తప్ప అత్యధిక ప్రాంతాల్లో కరోనా కేసుల వ్యాప్తి లేనే లేదన్నారు. తమ రాష్ట్ర కరోనా నియంత్రణ చర్యలను కేంద్రసంస్థలే ప్రశంసించాయన్నారు.













