కేసీఆర్పై ఈటల భార్య పోటీ..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మూడ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే కేండిడేట్స్ ను అనౌన్స్ సేయడంతో మిగిలిన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేయడంలో బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించి వాటి వడబోతలో నిమగ్నమై ఉంది. ఇక బీజేపీ కూడా అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. బీజేపీ తరపున పోటీ చేసేందుకు నేతలు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. దరఖాస్తులను వీలైనంత త్వరగా వడపోసి అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది బీజేపీ.
అయితే ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే విషయంపై బీజేపీలో ఉత్కంఠ కనిపిస్తోంది. సీనియర్ నేతల్లో రఘునందన్ రావు ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన నేతలెవరూ దరఖాస్తులను పట్టించుకోలేదు. అప్లై చేసుకోకపోయినా తమకు సీటు గ్యారెంటీ అనే నమ్మకమో.. లేకుంటే అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఇంట్రస్ట్ లేకపోవడమో తెలీదు కానీ చాలా మంది సీనియర్లు దరఖాస్తు చేయలేదు. అయితే ఈటల రాజేందర్ భార్య ఈటల జమున గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
గజ్వేల్ కేసీఆర్ కంచుకోట. ఇప్పటికే ఆయన ఇక్కడి నుంచి రెండుసార్లు గెలపొందారు. మూడోసారి కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఈ నియోజకవర్గంలోనే ఉంది. దీంతో ఆయన ఇక్కడి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నా.. గెలిచిన తర్వాత గజ్వేల్ నే ఉంచుకుంటారనే టాక్ నడుస్తోంది. అయితే గజ్వేల్ నుంచి కేసీఆర్ పైన పోటీ చేసే వాళ్లెవరనేదానిపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ పై పోటీ చేసేందుకు గతంలోనే ఈటల రాజేందర్ ఆసక్తి చూపించారు. పార్టీ ఆదేశిస్తే గజ్వేల్ లో పోటీ చేస్తానని ప్రకటించారు.
అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ కాకుండా ఆయన భార్య జమున గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈటల రాజేందర్ ప్రస్తుతం హుజూరాబాద్ కు ప్రాతనిధ్యం వహిస్తున్నారు. ఆయన మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగుతారని .. కేసీఆర్ పైన మాత్రం ఈటల జమున పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మొత్తానికి కేసీఆర్ పై ఈటల ఫ్యామిలీలో ఎవరో ఒకరు పోటీ చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ తరపున కేసీఆర్ పై పోటీ చేసేందుకు ఇతర నేతలెవరూ పెద్దగా ఉత్సాహం చూపించకపోవడంతో బీజేపీ జముననే అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.













