అమెరికాకు చెందిన ఎమాగియా, ఓయు మధ్య ఒప్పందం
కృత్రిమమేధ, ఫిన్‌టెక్ రంగాల్లో దిగ్గజ సంస్థ అమెరికాకు చెందిన ఎమాగియా, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఫిన్‌టెక్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. ఈ ల్యాబ్‌లో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, వెబ్ త్రీ, ఐవోటీ, ఫిన్‌టెక్ ఆవిష్కరణలకు ఊతం ఇచ్చే ఇతర సాంకేతికాంశాలపై పరిశోధనలపై దృష్టి సారించనున్నారు. ఈ మేరకు ఎమాగియా, హైదరాబాద్ ఉస్మానియా ఫౌండేషన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్యం ఓయూ విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి, వారిని గ్లోబల్ ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడంలో ఉపకరిస్తుందని ఓయూ వీసీ రవీందర్ పేర్కొన్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఫిన్‌టెక్ సేవల్లో మైలురాయిగా నిలిపేందుకు కృషి చేయనున్నట్టు ఎమాగియా ఫౌండర్, సీఈవో వీణా గూడవల్లి తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఓయూ అధికారులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.













