కవిత అరెస్టుకు ఈడీ రంగం సిద్ధం చేసిందా..?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. రేపు ఈడీ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. దీంతో కవిత రేపు ఈడీ ఎదుట హాజరవనున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మెజారిటీ వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయారు. దీంతో ఈ కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసారి కవిత అరెస్టు ఖాయమనే వార్తలు వస్తున్నాయి.
దక్షిణ భారతదేశానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని ఈడీ ఈ వారంలో అరెస్టు చేయబోతోందంటూ రెండు మూడు రోజులుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఆ వ్యక్తి ఎవరయి ఉంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈడీ సమన్లు ఇచ్చిందనే విషయం తెలియగానే ఆ వ్యక్తి కవితే అయి ఉంటారని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే కవిత అరెస్టు దాకా వెళ్లి వచ్చింది. గతంలో విచారణ సందర్భానే కవితను అరెస్టు చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అప్పుడు అరెస్టు చేయలేదు. ఫలు దఫాలుగా విచారించి, ఆధారాలు తీసుకుని వదిలిపెట్టింది ఈడీ.
ఆరు నెలల కిందట మార్చి 16, 20, 21 తేదీల్లో కవిత చివరిసారిగా ఈడీ ఎదుట హాజరైంది. అప్పుడు అరెస్టు అవుతుందనుకున్నారు కానీ అలా జరగలేదు. కానీ ఈసారి మాత్రం కవిత అరెస్టు ఖాయమనుకుంటున్నారు. ఈ కేసులో దినేశ్ అరోరా, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, ఆడిటర్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్లుగా మారారని తెలుస్తోంది. వీరిలో అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు అత్యంత సన్నిహితుడు. ఇక గోరంట్ల బుచ్చిబాబు కవిత ఆడిటర్ గా ఉన్నారు. ఇలా సన్నిహితులే అప్రూవర్లుగా మారడంతో కవితకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
కవితను అరెస్టు చేయకపోవడం వల్ల తెలంగాణలో బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ రెండు పార్టీలు కలిసిపోవడం వల్లే కవిత అరెస్టు ఆగిపోయిందని రామర్లు ఉన్నాయి. బీజేపీ బలపడాలంటే కవితను కచ్చితంగా అరెస్టు చేయాల్సి ఉంటుందని.. లేకుంటే తెలంగాణలో బీజేపీని ఎవరూ నమ్మరని చెప్పుకుంటున్నారు. తెలంగాణ నేతలు కూడా ఈ అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అందుకే కవితను అరెస్టు చేయడం ద్వారా తాము బీఆర్ఎస్ కు దగ్గర కాదని చెప్పుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ. ఎన్నికల్లో కాస్తోకూస్తో లబ్ది పొందాలంటే ఇది చాలా అవసరం. అందుకే పార్టీని ఫణంగా పెట్టడం ఇష్టంలేని బీజేపీ.. కవితను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.













