KTR : కేటీఆర్ ఫార్ములా ఈ-రేస్ కేసులోకి ఎంటరైన ఈడీ..!!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు – కేటీఆర్ (KTR) పై ఫార్ములా ఈ – రేస్ కేసు నమోదైంది. ఈ రేసు నిర్వహణకు సంబంధించి నిధుల గోల్ మాల్ జరిగాయనే ఆరోపణలై ఆయనపై ప్రభుత్వం కేసు పెట్టింది. ఇది తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. కేసు నమోదును బీఆర్ఎస్ (BRS) శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసు పూర్వాపరాలను తమకు అందించాల్సిందిగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ – ఈడీ.. సీఐడీకి లేఖ రాసింది. దీంతో ఈ వ్యవహారంలో కేంద్రం కూడా ఎంటరైనట్లయింది.
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఫార్ములా ఈ-రేస్ (Formula E-Race) నిర్వహించింది. అప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ రేస్ నిర్వహణకోసం HMDA రూ.20 కోట్లు ఖర్చు చేయగా.. రేస్ ప్రమోటర్ సంస్థ నెక్స్ట్ జెన్ రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. అయితే ఈ రేస్ వల్ల అటు HMDA, ఇటు నెక్స్ట్ జెన్ నష్టపోయాయి. దీంతో అనధికారికంగా నెక్స్ట్ జెన్ (Nextzen) సంస్థకు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ రూ.55 కోట్లను బదిలీ చేశారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ నిధులను బదిలీ చేసినట్లు అర్వింద్ కుమార్ వెల్లడించారు. కేబినెట్ అనుమతి కానీ, HMDA అనుమతి కానీ లేకుండా ఇలా నిధులను బదిలీ చేయడంపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అర్వింద్ కుమార్, దానకిశోర్, కెఎల్ఎన్ రెడ్డి తదితరులను విచారించింది. తాజాగా గవర్నర్ అనుమతించడంతో కేటీఆర్ ను ఏ1గా చేర్చుతూ FIR నమోదు చేసింది. ప్రస్తుతం ACB ఈ కేసు విచారణను వేగవంతం చేసింది. దీంతో ఈ కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు కేటీఆర్ పై కేసు అక్రమం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని స్తంభింపచేశారు. ఈ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. కేసు నమోదైన వెంటనే కేటీఆర్ కూడా ఈ-రేస్ పై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై చర్చించాల్సింది ఏమీ లేదని ఏసీబీ కేసు నమోదు చేసిందని కాంగ్రెస్ చెప్తోంది.
మరోవైపు ఇది డబ్బుకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈడీ (ED) రంగంలోకి దిగింది. ఫార్ములా ఈ-రేస్ కేసు పూర్వాపరాలను పంపించాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. డబ్బులు ఎప్పుడు బదిలీ జరిగింది.. ఎంత బదిలీ జరిగింది.. కేసు ఎప్పుడు నమోదైంది.. ఎవరెవరు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.. దానకిశోర్ ఏమని ఫిర్యాదు చేశారు.. లాంటి వివరాలన్నీ తమకు అందించాలని ఈడీ కోరింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రానికే పరిమితం కాకుండా కేంద్రం వరకూ వెళ్లేలా కనిపిస్తోంది. అయితే కేటీఆర్ కు మొదట నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ సిద్ధమవుతోంది. అనంతరం ఎప్పుడైనా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేస్తే ముందస్తు బెయిల్ కోసం కేటీఆర్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంది.