KTR: బ్రేకింగ్, కేటిఆర్ కు షాక్ ఇచ్చిన ఈడీ, ఎఫ్ఐఆర్ ఫైల్

ఫార్ములా ఈ కారు రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కారు రేసు అంశంపై కేసు నమోదు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ (ED). ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసింది ఈడీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఆర్వింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పై కేసు నమోదు చేసారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారం తెలంగాణకు మాత్రమే పరిమితం కాగా ఈ రోజు చోటు చేసుకున్న పరిణామాలతో జాతీయ స్థాయికి వెళ్ళింది.
నేడు ఉదయమే ఈడీ అధికారులు… ఏసీబీ (ACB) కి ఓ లేఖ రాసారు. కేసు వివరాలు, లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను, దాన కిషోర్ ఫిర్యాదు కాపీని తమకు పంపాలని కోరారు. దీనితో ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను తేదీలతో సహా ఈడీ అధికారులకు అందించారు. దీనితో ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ అధికారుల అరెస్ట్ నుంచి కొన్నాళ్ళ పాటు కేటిఆర్ తప్పించుకున్నా… కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం అనే సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ హైకోర్టులో నేడు కేటిఆర్ పిటీషన్ పై విచారణ జరగగా… 10 రోజుల వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోర్ట్ ఆదేశించింది. అయితే ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ ను హైకోర్టు ఆదేశించింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నేడు విచారణ జరిగింది. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో కేటిఆర్ ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి కూడా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాప్రతినిధి కావడం, మాజీ మంత్రి కావడంతో గవర్నర్ అనుమతి తీసుకుని అడుగులు వేసింది రాష్ట్ర ప్రభుత్వం.