‘రైతుబంధు’ రాజకీయం
రైతుబంధుకు బ్రేక్పై రాజకీయం మొదలైపోయింది. పాతపథకం కావడంతో ప్రభుత్వం అభ్యర్థన మేరకు రైతుబంధుకు మొదట ఈసీ అనుమతించింది. ఇంకేముంది రైతుల ఖాతాల్లో పైసలు పడతాయని అందరూ భావించారు. కానీ.. మంత్రి హరీశ్ రావు ప్రచారసభలో రైతుబంధును ప్రస్తావించడంతో.. ఈసీ, రైతుబంధు విడుదలపై ఆదేశాలిచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని అన్ని పార్టీలు క్యాష్ చేసుకునే పనిలోపడ్డాయి. కాంగ్రెస్ వల్లే రైతు బంధు నిలిచిపోయిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, కాదు.. బీఆర్ఎస్ నేతల వల్లే ఆగిందని కాంగ్రెస్ కౌంటరిస్తోంది. ఈ రెండు పార్టీలు ఫేక్ డ్రామాలాడుతున్నాయని గట్టిగా ఆరోపణలు గుప్పిస్తోంది బీజేపీ.
రైతు బంధు సాయం పంపిణీకి ఈసీ అనుమతి ఉపసంహరించుకోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లెటర్ రాయడంతోనే.. ఈసీ తన నిర్ణయాన్ని ఉపసంహరించకుందని బీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి రాకముందే, రైతుల పొట్టగొడుతూ కాంగ్రెస్ వారి ఉసురు పోసుకుంటోందన్నారు. రైతు వ్యతిరేకతను కాంగ్రెస్ మరోసారి బయటపెట్టిందని ఆరోపించారు.
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప.. రైతులకు మేలు కలగాలన్న ఉద్దేశం మామా-అల్లుళ్లకు లేదన్నారు రేవంత్ రెడ్డి. హరీశ్ రావు ప్రకటనతోనే తామీ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపిందన్నారు. తనపేరుతో ఓ ఫేక్ ప్రకటన విడుదల చేసి, రైతుల్లో అయోమయం కలిగించాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. రైతులు ఆందోళన చెందొద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుబంధు డబ్బులు..రైతు ఖాతాలో పడుతుందన్నారు రేవంత్.
వాస్తవానికి ఏటా రైతు బంధు పథకం కింద జూన్, జూలై నెలలతో పాటు డిసెంబర్, జనవరి నెలల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తుంది. 2018లో ఎన్నికలు ముందుగా రావడంతో అక్టోబర్ లోనే డబ్బులు వేసేసింది. ఈసారి నవంబర్లో పోలింగ్ ఉండడంతో ముందుగా డబ్బులు వేయాలని భావించింది. పాతపథకం కావడంతో రెండురోజుల ముందు ఈసీ అనుమతించింది. దీంతో BJP, BRS ఒకటే అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే తర్వాతి పరిణామాలతో రైతుబంధు డబ్బుల విడుదలకు బ్రేకేసింది.













