కెసిఆర్ ని తిడితే జరిగే నష్టం తెరాస వాళ్లకు అర్ధం కావట్లేదా…?
తెలంగాణా… ఇప్పుడు బీజేపి ప్రధాన లక్ష్యం… బిజెపి విషయంలో తెలంగాణా అధికార పార్టీకి కూడా ఒక అవగాహన ఉంది. ఆ పార్టీ అడుగుపెట్టిన రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాన్ని స్వయంగా చూస్తుంది కూడా. సీఎం కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన బీజేపి విషయంలో ఉందనే మాట వాస్తవం. కాని తెరాస పార్టీ మంత్రులకు ఉందా…? అసలు వాళ్ళ లెక్క ఏంటీ…? దీని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయం చూస్తే… సీఎం కేసీఆర్ మీద తెరాస నేతలకు కాస్త ధీమా ఎక్కువ. ఏది జరిగినా కేసీఆర్ చూసుకుంటారులే అనే ధీమా ఎక్కువ.
దానికి తోడు ఆయన ఇమేజ్ తోనే గెలిచాం కదా మనం అనే భావనలో వాళ్ళు ఉంటారు. అది తప్పు లేదు గాని… ఆ ధీమా శృతి మించితే వచ్చే సమస్యలు ఊహకు కూడా అందవు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించడం లేదు. గత ఆరు నెలల నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇష్టం వచ్చినట్టుగా, తిట్టిన తిట్టు తిట్టకుండా, రేవంత్ రెడ్డి కంటే దారుణంగా తిడుతున్నా సరే ఒక్క ఎమ్మెల్యే కూడా ముందుకు వచ్చి కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడటం లేదనే విషయం అర్ధమవుతుంది.
మా వరకు వచ్చాక చూసుకుందాం అనే వాళ్లు కొందరు ఉంటే తిట్టేది కేసీఆర్ ని కదా అని కొందరు అనుకుంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నేతలు గాని, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నేతలు గాని ఒక్కరు అంటే ఒక్కరు కూడా మీడియా ముందుకు రావడం లేదు. వస్తే వేముల ప్రశాంత్ రెడ్డి లేకపోతే గంగుల కమలాకర్… ఈ ఇద్దరు బయట నుంచి తెరాసలోకి వచ్చిన నేతలే. వాళ్లకు ఉన్న ప్రేమ… తెరాసలో ముందు నుంచి ఉన్న వాళ్లకు లేకపోయింది. ఉమ్మడి జిల్లాల్లో మొత్తం కలిపి పది మంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం లేదు.
హరీష్ రావు, కేటిఆర్, ఎర్రబెల్లి దయాకర్ వంటి నేతలు మినహా ఎవరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మిగిలిన మంత్రులలో చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు. హైదరాబాద్ టూ బెంగళూరు తిరుగుతున్నారు గాని సిఎం కేసీఆర్ ను తిడుతుంటే మాట్లాడటం లేదు. అందుకే రాష్ట్ర స్థాయిలో తెరాస కనపడకుండా నష్టపోతుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పటికి అయినా వాస్తవాలను గ్రహించి, సిఎం కేసీఆర్ ని తిట్టినప్పుడు ఒక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి… బాల్క సుమన్ లాగో, గువ్వల బాలరాజు లాగో, నన్నపునేని నరేంద్ర లాగో, దాస్యం వినయ్ భాస్కర్ మాదిరో తిడితే కేసీఆర్ కూడా మీ మీద ప్రేమ చూపిస్తారు అని కొంతమందికి సూచిస్తున్నారు.













