కవిత పార్టీకి ఆదిలోనే అపశ్రుతి! ఎందుకంత తొందర?
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయాలని తహతహలాడుతున్న కల్వకుంట్ల కవిత, కొత్త పార్టీ ప్రస్థానాన్ని అత్యుత్సాహం, అయోమయాల మేళవింపుతో ప్రారంభించారు. ఒక రాజకీయ పార్టీకి పేరు అనేది కేవలం పేరు మాత్రమే కాదు. అది ఆ పార్టీ సిద్ధాంతానికి, అజెండాకు ప్రతిబింబం. కానీ కవిత విషయంలో పార్టీ పేరు ప్రకటనే ఒక ప్రహసనంగా మారింది. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) అని ఊదరగొట్టి, చివరకు ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేయడం ఆమె రాజకీయ పరిణతిని తెలియజేస్తోంది.
రాజకీయాల్లో సెంటిమెంట్ పండించడం ఒక ఎత్తు, కానీ అదే సెంటిమెంట్‌ను అడ్డదారిలో క్యాష్ చేసుకోవాలనుకోవడం మరో ఎత్తు. పాత TRS పేరుపై ఉన్న ప్రజల అభిమానాన్ని వాడుకోవాలనే దుందుడుకు ఆలోచనతోనే కవిత బృందం ఈ ప్లాన్ వేసినట్లు స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో, గ్రాండ్ లాంచ్ ఈవెంట్లలో ‘రాష్ట్ర సేన’ అని ప్రచారం చేసి, లోగోలు, జెండాలు ఆవిష్కరించి.. తీరా ఈసీ దగ్గరకు వచ్చేసరికి ‘రక్షణ సేన’ అని పేరు మార్చడం వెనుక ఆమె భయం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చే సాంకేతిక అభ్యంతరాలను ఎదుర్కొనే దమ్ము లేకనే, ఇలా దొడ్డిదారిలో TRS అనే అక్షరాలు వచ్చేలా ‘రక్షణ సేన’ను ఎంచుకున్నారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి
కవిత రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, ఆమె క్షేత్రస్థాయి వ్యూహాల కంటే ఈవెంట్ మేనేజ్మెంట్ పైనే ఎక్కువ ఆధారపడుతున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో భారీ హంగామా చేయడం, గ్రాఫిక్స్, లోగోలతో హైప్ క్రియేట్ చేయడంపై పెట్టిన శ్రద్ధ, కనీసం ఏ పేరుతో దరఖాస్తు చేస్తున్నామనే కనీస పారదర్శకతపై పెట్టలేదు. అప్లికేషన్ ఒక పేరుతో, ప్రచారం మరో పేరుతో చేయడం వల్ల పార్టీ విశ్వసనీయత పునాదుల్లోనే కదిలిపోయింది. ఈ స్థాయిలో గందరగోళం ఉంటే, ప్రజలు ఈ పార్టీని ఒక సీరియస్ పొలిటికల్ ఫోర్స్‌గా ఎలా గుర్తిస్తారనేది మిస్టరీ.
ఎన్నికల కమిషన్ ఇంకా పార్టీకి గుర్తింపు ఇవ్వనేలేదు. కేవలం పేరు నమోదు ప్రక్రియలో భాగంగా అభ్యంతరాల స్వీకరణ కోసం ఈసీ పబ్లిక్ నోటీసు ఇచ్చింది. ఇది అత్యంత ప్రాథమిక దశ. కానీ కవిత టీమ్ మాత్రం తమకే ఈసీ అప్రూవల్ వచ్చేసిందని, తమదే అసలైన టీఆర్ఎస్ అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ అత్యుత్సాహం కవితను ఇప్పుడు డిఫెన్స్‌లో పడేసింది. ఈసీ నోటీసులో ‘రక్షణ సేన’ అనే పేరు బయటపడటంతో, కనీసం ఆ తప్పిదాన్ని సరిదిద్దుకునే వివరణ ఇచ్చే ధైర్యం కూడా ఆమె బృందం చేయడం లేదు.
తెలంగాణ రాజకీయాల్లో ఖాళీగా ఉన్న స్పేస్‌ను భర్తీ చేయాలనే కంగారులో కవిత తన అడుగులను తనే తడబడేలా చేసుకుంటున్నారు. ఒక కొత్త వ్యవస్థను నిర్మించేటప్పుడు పునాదులు బలంగా ఉండాలి. కానీ ఇక్కడ పునాదులే అబద్ధాల మీద, తప్పుడు ప్రచారాల మీద పడుతున్నాయి. పేరులో స్పష్టత లేదు.. వ్యూహంలో చిత్తశుద్ధి కనిపించట్లేదు.. నిర్ణయాల్లో పారదర్శకత లేదు.
రాజకీయాల్లో వేగం అవసరమే, కానీ అది విచక్షణను దాటినప్పుడు ఇలాంటి వికటించే ఫలితాలే వస్తాయి. పేరు మార్పులు, సాంకేతిక లోపాలు, అస్థిరమైన ప్రకటనలతో సాగుతున్న కవిత కొత్త ప్రయాణం, అత్యుత్సాహం స్థాయిని దాటి ఆమె రాజకీయ భవిష్యత్తుకే ముప్పుగా పరిణమించేలా ఉంది. పారదర్శకత లేని పాలిటిక్స్ ప్రజల్లోకి వెళ్లవు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నా, కవిత తన పంథాను మార్చుకోకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి








