కథ సమాప్తం..! వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన దేత్తడి హారిక..!!
తెలంగాణ పర్యాటక అభివృద్ధ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారిక నియమితులైన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకం అనేక వివాదాలకు దారి తీసింది. ఎన్నో ఆరోపణలు, విమర్శలు వినిపించాయి. దీంతో తన చుట్టూ జరుగుతున్న వివాదాలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలని హారిక భావించినట్లుంది. ఈ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది.
ప్రపంచ మహిళా దినోత్సవం రోజు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారిక నియమితులయ్యారు. ఆ సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా ఆమెను అధికారికంగానే నియమించారు. ఈ మేరకు ఒప్పంద, నియామక పత్రాలను అందించారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో దేత్తడి హారికకు శుభాకాంక్షలు వెల్లువత్తాయి. అదే సమయంలో అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఒకే కులానికి చెందినవాళ్లు కాబట్టి హారికకు ఆ పదవిని కట్టబెట్టారని.. అసలు హారికకు ఏం అర్హతలున్నాయని కొందరు ప్రశ్నించారు. ఇంతకంటే మంచి పర్సనాలిటీ దొరకలేదా అని అడిగారు.
మరోవైపు హారిక నియామకం సంగతి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి కూడా తీసుకెళ్లలేదు ఆ సంస్థ ఛైర్మన్ శ్రీనివాసగుప్తా. ఇదే విషయాన్ని ఆయన అడిగినట్లు సమాచారం. మరోవైపు సీఎంఓ కార్యాలయం కూడా హారిక నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయినా ఉప్పల శ్రీనివాస గుప్తా మాత్రం వెనక్కు తగ్గలేదు. కరోనా వల్ల పర్యాటకం పడకేసిందని.. దాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాలో పాపులర్ అయిన హారికను నియమించామని సమర్థించుకున్నారు. తక్కువ ఖర్చుతో హోటళ్లను, పర్యాటకాన్ని అవసరమైనప్పుడు ప్రమోట్ చేసేందుకే బ్రాండ్ అంబాసిడర్ గా హారికను నియమించుకున్నట్టు మీడియాతో చెప్పారు.
అయినా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. సాక్షాత్తూ మంత్రి శ్రీనివాస గౌడ్ ఈ అంశంపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నియామకం సంగతి తమ దృష్టికి రాలేదని.. ఇక్కడ వ్యక్తిగత ఇష్టాలు ఉండవని స్పష్టం చేశారు. సీఎం అనుమతితో గుజరాత్ లో అమితాబ్ బచ్చన్ లాగా తెలంగాణ పర్యాటక రంగానికి కూడా ఒక ఫేమస్ వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తామని చెప్పారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదని అర్థమైంది. మంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం.. సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస గౌడ్ కూడా తన నియామకాన్ని సమర్థించుకోవడం.. లాంటి పరిణామాలు ప్రభుత్వంలో గ్యాప్ ను తెలియజేశాయి.
అందుకే హారికను రేపోమాపో తొలగిస్తారేమోననే వార్తలు గుప్పుమన్నాయి. తనను తొలగించక ముందు తానే తప్పుకుంటే బెటర్ అని భావించిందేమో.. అనివార్య కారణాల వల్ల తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు పెట్టింది. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యావాదాలు చెప్పింది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.. అంటూ వెల్లడించింది. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది.













