హస్తం సమరోత్సాహం..
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు రూట్ మ్యాప్ రెడీ అయిందా? చాపకింద నీరులా అధిష్టానం గ్రౌండ్ వర్క కానిచ్చేస్తోందా? ఇప్పటికే సగానికి పైగా అభ్యర్థుల ఎంపిక జరిగిపోయిందా? వారి నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేసేస్తున్నారా? కాంగ్రెస్ నేతల తీరు చూస్తే అదే అనిపిస్తోంది. బీఆర్ఎస్ పని అయిపోయిందని.. ఇక గెలుపు తమదే అంటున్నారు.అందుకు తగినట్లుగా పరిస్థితులు కూడా .. హస్తం పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి. పొంగులేటి, జూపల్లి పార్టీలో చేరుతుండగా..మిగిలిన నేతలు సైతం హస్తం పార్టీవైపు చూస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో 60 సీట్లు ఖరారు అయిపోయాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వారంతా ఎవరి స్థానాల్లో వారు పని చేసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడం అనేది గత చరిత్ర అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది మునిగిపోయే నావ అని తేల్చిచెప్పారు. ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తే దూరంగా ఉన్నారు.. ఇప్పుడేమో అమిత్ షా దగ్గర మోకరిల్లారని ఎద్దేవా చేశారు. మొన్నటి దాకా బీఆర్ఎస్, బీజేపీ దాగుడు మూతలు ఆడాయని.. ఇప్పుడు బీఆర్ఎస్-బీజేపీ డ్రామాలు బయటపడ్డాయని జీవన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇప్పటికే పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు.. తమతో టచ్ లో ఉన్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే సమయం వచ్చినప్పుడు వారు పార్టీలోకి రావడం జరుగుతుందన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న డికె శివకుమార్.. తన మార్క్ స్ట్రాటజీని చూపిస్తున్నారు. ఎక్కడ ఎవరు బలమైన అభ్యర్థులు…వారిని ఎలా పార్టీలోకి తీసుకురావాలి అన్నదానిపై సలహాలు , సూచనలు అందిస్తున్నారు. దీనికి తోడు షర్మిల కూడా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపుగా అన్ని నియోజక వర్గాల్లోనూ బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకుప్రయత్నాలు చేస్తున్నారు.
సీనియర్లు ఏకతా రాగం వినిపిస్తున్నారు. దీనికి తోడు చాలా మంది నేతలు.. తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నారు. ప్రజలను కలుస్తూ, వారి సమస్యలు వింటూ, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత అధికంగా ఉందని .. ప్రజలే వారిని ఓడిస్తారని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ టికెట్లకు విపరీతమైన పోటీ ఏర్పడుతోంది. అయితే అసంతృప్తులతో ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ సైతం మొదలుపెట్టినట్లు సమాచారం













