తెలంగాణ తొలి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి…
తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించి, దేశం దృష్టిని ఆకర్షించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అంతేకాదు.. తెలంగాణలో తొలి కాంగ్రెస్ సీఎంగా కూడా రికార్డు సృష్టించారు. ఆది నుంచి ఒకటే నమ్మకం.. పట్టుసడలని ధైర్యంతో ముందడుగేశారు. బాహుబలి లాంటి కేసీఆర్ ను ఢీకొట్టడం మీవల్ల కాదని చాలా మంది చాలారకాలుగా భయపెట్టినా, వెనుదిరగలేదు. అంతేకాదు…. ఓసారి కమిటైతే నామాట నేనే వినను అన్నట్లుగా వ్యవహరించారు రేవంత్. ఎవరు సహకరించినా, ఎవరు సహకరించకున్నా.. పోరాటంలో వెనుదిరిగే ప్రసక్తే లేదంటూ ముందుకురికారు. ఎట్టకేలకు బీఆర్ఎస్ కు షాకిచ్చి, కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేశారు.తెలంగాణ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్ సీఎంగా రికార్డు సృష్టించారు.
రేవంత్ ప్రస్థానం…
టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి.. మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డి పల్లి, వంగూర్‌లో నవంబర్ 08, 1969న జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తండ్రి పేరు అనుముల నర్సింహ రెడ్డి. తల్లి అనుముల రామచంద్రమ్మ. మహబూబ్‌నగర్‌కి చెందిన రేవంత్ రెడ్డి చిన్ననాటి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవారు. గ్రాడ్యూయేషన్ చదవుతున్న సమయంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ.వీ. కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను వివాహమాడారు.
రాజకీయంగా..
1992 విద్యార్థిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో సభ్యుడయ్యారు. 2004లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2006 జెడ్టీపీసీ ఎన్నికల్లో మిడ్జిల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గారు. 2008 శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.2008లో రేవంత్ రెడ్డి మరోసారి టీడీపీలో చేరారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గురునాథ్ రెడ్డిని ఓడించారు. 2014లో మరోసారి అదే స్థానం నుంచి గెలుపొందారు.
చంద్రబాబు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో.. పార్టీలో రాజకీయంగా వేగంగా అత్యున్నతస్థాయికి ఎదిగారు రేవంత్. ఒక శూలశోధన ఆపరేషన్‌లో దొరికినందుకు గానూ అవినీతి వ్యతిరేకం విభాగం పోలీసులు 2015 మేలో ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు నెలల తర్వాత ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. 2018 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టికెట్‌పై కొడంగల్ నుంచి పోటీ చేశారు. 2018 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా నియమితులయ్యారు. 2017 రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..
రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్‌లో టిడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా 26 జూన్ 2021లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది.
డైరెక్ట్ ముఖ్యమంత్రిగా..
2021 జులై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో మంత్రి కాకుండానే ఎమ్మెల్యే నుంచి నేరుగా సీఎంగా ప్రమోషన్ పొందారు రేవంత్ రెడ్డి.













