కాంగ్రెస్ దళిత అస్త్రం…
కన్నడ ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్ చేరికలను ప్రోత్సహిస్తోంది. అధికార బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్త నేతలను .. హస్తం గూటికి చేర్చుకుంటోంది. అయితే దీనికి తోడు బలమైన నినాదాన్ని తయారు చేసి జనంలోకి వదులుతోంది. వెనకబడిన, దళిత, గిరిజన వర్గాల నేతలను సీఎం అభ్యర్థులుగా సంకేతాలిస్తోంది. కాంగ్రెస్ లో రెడ్లకు ప్రాబల్యమున్నప్పటికీ సీఎంగా ఎస్సీసామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్క ఫోకస్ అవుతున్నారు. ఈసందర్భంలో ఎస్టీలను ఆకర్షించేందుకు మరో కొత్తపేరును తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే సీతక్కను డిప్యూటీ సీఎంగా చేసే అవకాశముందా అన్న విలేకరుల ప్రశ్నకు… సందర్భం కలిసొస్తే సీఎంగా చూడొచ్చన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ తీరుపై గుర్రుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, గిరిజనుల ఓట్లను గంపగుత్తగా కలెక్ట్ చేసేందుకు కాంగ్రెస్ వడివడిగా పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. రాజకీయంగా భట్టి విక్రమార్క సీనియర్.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. మరోవైపు ఎస్టీ సామాజికవర్గానికి చెందిన సీతక్కది.. గిరిజన నేపథ్యం.. యువతలో మంచి క్రేజ్ ఉంది. అంతే కాదు.. నిజాయతీ పరురాలు.. కరోనా సమయంలో అటవీ గూడేల్లోకి ఆహారం పట్టుకెళ్లి ఇచ్చిన సందర్భం విజువల్స్ రూపంలో వైరల్ అయ్యాయి. పార్టీలకు అతీతంగా సీతక్కకు అభిమానులున్నారన్నది నిర్వివాదాంశం..
దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. హిమాచల్, కర్నాటక ఫలితాలతో ఆయన ప్రతిష్ట ఆకాశాన్నంటింది. ఇక… దేశంలో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే.. వాటిలో మూడుచోట్ల ముఖ్యమంత్రులు ఓబీసీలే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలను ఓపద్ధతి ప్రకారం తనవైపు తిప్పుకునేందుకు దేశస్థాయిలో కాంగ్రెస్ పావులు కదుపుతోందనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు. మరోవైపు.. ఇప్పుడు దీన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణలోనూ ఎస్సీ, ఎస్టీ నేతలను సీఎం అభ్యర్థులుగా ఫోకస్ చేయడం ద్వారా…. ఆయా వర్గాలు హస్తానికి ఓటేస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఇప్పుడు మిగిలిన పార్టీలు.. దీనికి బదులిచ్చే స్థాయిలో లేవని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ సీఎంగా కేసీఆర్ ఉన్నారు. ఆయన తర్వాత వారసులిగా కుటుంబసభ్యులకే అవకాశముంది. ఇక బీజేపీలో సైతం రెడ్లకే ప్రాధాన్యత ఉందని .. పార్టీలోనే అంతర్గతంగా వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే ఎన్నికల ముందు బండి సంజయ్ ను దింపేసి.. కిషన్ రెడ్డిని .. ఆపార్టీ అధ్యక్షుడిగా నియమించింది. కేంద్రంలో మోడీ సర్కార్ బలంగా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ఆపార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అస్త్రం ఎలా పనిచేస్తుందో వేచి చూడాలి..













