బీఆర్ఎస్కు కాంగ్రెస్ కౌంటర్ స్ట్రాటజీ రెడీ..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కూడా ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ తీసుకొచ్చింది. ఇదే స్పీడ్ తో పని చేసి తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహరచన చేస్తోంది.
జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఔనన్నా కాదన్నా సోనియా గాంధీ కరుణించడం వల్లే తెలంగాణ ఏర్పడింది. సోనియా లేకుంటే తెలంగాణ సాకారమయ్యేది కాదు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కంటే తెచ్చిన టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. అందుకే వరుసగా రెండు సార్లు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ వచ్చి 9 ఏళ్లు పూర్తయింది. జూన్ 2న పదో ఏట అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని దశదిశలా తెలియజేయాలని కేసీఆర్ ఆదేశించారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఇవాళ గాంధీ భవన్లో సమావేశమైంది. పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించింది. ఫెయిల్యూర్ కేసీఆర్ పేరుతో ఈ కార్యక్రమాన్ని 20 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించింది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని మండల కేంద్రాల్లో సోనియా చిత్ర పటాలకు పాలాభిషేకం చేయాలని తీర్మానించింది. ఈ వేడుకలకు కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎంలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించింది.
కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కాస్త జోష్ పెరిగింది. పార్టీ నేతలు కూడా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అంతకుముందు ఎవరికివారుగా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. అయితే ఇలా నేతలు కలిసికట్టుగా ఎంతోకాలం ఉంటారని భావించలేం. ఎప్పుడైనా మళ్లీ నేతలు ప్లేటు పిరాయించొచ్చు. అదే కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య. అలా కాకుండా ఇదే ఐకమత్యంతో నేతలంతా పనిచేస్తే కచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.













