తెలంగాణ బీజేపీలో తీవ్ర గందరగోళం..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీలో ఏం జరుగుతోందో నేతలకు కూడా అర్థం కావట్లేదు. అధ్యక్షుడిని మారుస్తున్నారని, పార్టీలో ప్రక్షాళన చేస్తున్నారని రోజూ వార్తలు వినిపిస్తున్నాయి. అధిష్టానం మాత్రం వీటిపై క్లారిటీ ఇవ్వట్లేదు. దీంతో నేతల్లో అయోమయం నెలకొంది. బండి సంజయ్ ని మారుస్తున్నారా.. కిషన్ రెడ్డికి పగ్గాలిస్తారా.. ఈటల, కోమటిరెడ్డి పరిస్థితి ఏంటి.. వాళ్లకు ఏవైనా బాధ్యతలు ఇస్తున్నారా.. అని నేతలంతా ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ ప్రశ్నలకు సమాధానం చప్పే నాయకులు లేరు. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే మీమాంస పార్టీ నేతల్లో నెలకొంది.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ దూకుడు పెరిగింది. పార్టీ కార్యక్రమాలు జోరందుకున్నాయి. జాతీయ స్థాయి నేతలు కూడా తరచుగా రాష్ట్రంలో పర్యటిస్తూ పార్టీ కేడర్ లో జోష్ తీసుకొచ్చారు. దీంతో ఇతర పార్టీల్లోని పలువురు నేతలు బీజేపీ పట్ల ఆకర్షితులయ్యారు. దీంతో బీఆర్ఎస్ ను ఎదుర్కొనేది బీజేపీ మాత్రమేనని అందరూ భావించారు. మునుగోడు మినహా దుబ్బాక, హూజూరాబాద్ ఉపఎన్నికల్లో ఘనవిజయం సాధించింది పార్టీ. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు దాకా వెళ్లడంతో ఇక బీజేపీకి తిరుగులేదనుకున్నారు. ఇదే టెంపో కంటిన్యూ చేసి కేసీఆర్ ను గద్దె దించి జైలుకు పంపిస్తామని బీజేపీ నేతలు చెప్తూ వచ్చారు.
అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బీజేపీలో ఐకమత్యం లోపించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పార్టీలో నేతలను చేర్చుకునేటప్పుడు చూపించిన ఉత్సాహం ఇప్పుడు వాళ్లకు ప్రాధాన్యత కల్పించడంలో లేకుండా పోయింది. దీంతో వచ్చిన నేతలు అలకపూనారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు కేసీఆర్ పై కోపంతోనే బీజేపీ గూటికి చేరారు. కచ్చితంగా బీజేపీయే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుందనుకున్నారు. అయితే అరెస్టు దాకా వచ్చిన కవిత సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే సంకేతాలు బలంగా జనంలోకి వెళ్లాయి. దీంతో ఈటల, కోమటిరెడ్డి లాంటి నేతలు కూడా పార్టీని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. బండికి వ్యతిరేకంగా ఓ వర్గం తయారైంది. వీళ్లంతా మిగిలిన వాళ్లపై అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. బండి వ్యతిరేక వర్గం కూడా ఆయనపై కంప్లెయింట్స్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో రెండు వర్గాలను సంతృప్తి పరిచేందుకు కిషన్ రెడ్డికి అధ్యక్ష పగ్గాలివ్వాలనుకుంటోంది. అయితే దీన్ని బండి వర్గం వ్యతిరేకిస్తోంది. మరోవైపు బండిని తప్పించడం విషయంలో హైకమాండ్ లో కూడా విభేదాలు తలెత్తినట్టు సమాచారం. బండి సంజయ్ ని కంటిన్యూ చేయాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా బండిని తప్పించాలని అమిత్ షా, నడ్డా సూచిస్తున్నారు. మరి ఈ పంచాయితీకి ఎప్పుడు ఎలా ముగింపు దొరుకుతుందో చూడాలి మరి.













