Kavitha : పోటీ తథ్యం.. కొత్త పార్టీపై కవిత క్లారిటీ..!
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇన్నాళ్లుగా సందిగ్ధంలో ఉన్న తన రాజకీయ భవిష్యత్తుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు పూర్తి స్పష్టతనిచ్చారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు పరోక్షంగానే కాకుండా, ప్రత్యక్షంగానే సంకేతాలిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, తాను ఎవరి నీడలోనో కాకుండా స్వతంత్ర శక్తిగా ఎలక్షన్స్ రింగులో దిగుతానని ఆమె కుండబద్దలు కొట్టారు. తాజాగా తన రాజీనామా ఆమోదం కోసం అసెంబ్లీకి వెళ్లిన సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
గత కొంతకాలంగా కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆమె స్వయంగా దీనిపై స్పందించారు. “నాకు కొత్త పార్టీపై పూర్తి క్లారిటీ ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఔట్ రైట్ గా పోటీ చేస్తాం. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తాం” అని కవిత ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న యాత్రలో కూడా ప్రజలు ప్రధానంగా కొత్త పార్టీ గురించే అడుగుతున్నారని, ప్రజల నాడి కూడా అదే దిశగా ఉందని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల్లో తన ఫిలాసఫీని కవిత చాలా సరళంగా వివరించారు. “పప్పన్నం తింటాం.. పాదయాత్ర చేస్తాం.. ఇదే నా ఫిలాసఫీ” అని ఆమె వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వడమే తన లక్ష్యమని, ఆడంబరాలకు దూరంగా, పోరాటమే ఊపిరిగా తన ప్రస్థానం సాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
తాను పుట్టి పెరిగి, ఇన్నాళ్లు పనిచేసిన బీఆర్ఎస్ పార్టీతో బంధం తెగిపోయిందని కవిత స్పష్టం చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తీరు అత్యంత అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. “నన్ను అవమానకరంగా పార్టీలోంచి సస్పెండ్ చేశారు. నేను మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు” అని తెగేసి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్తో తిరిగి కలిసే అవకాశాలకు ఆమె పూర్తిగా తలుపులు మూశారు.
బీఆర్ఎస్లోని మిగతా నాయకులకు, తనకు ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని కవిత ఈ సందర్భంగా ఎత్తిచూపారు. మిగతా నాయకులంతా కేసీఆర్ చెప్పినట్లు నడుచుకున్నారని, కానీ తాను మాత్రం మొదటి నుంచి స్వతంత్రంగానే పనిచేశానని గుర్తుచేశారు. “2006 నుంచి 2014 వరకు తెలంగాణ జాగృతి పేరుతో నేను చేసిన పోరాటం స్వతంత్రమైనది. మిగతా నాయకులు కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేశారు. బండి నడిపేది ఒకరు.. కానీ తామే బండి నడుపుతున్నామని కొందరు ఫీల్ అవుతున్నారు” అంటూ పార్టీలోని సీనియర్లపై ఆమె చురకలు అంటించారు. తన రాజకీయ అస్థిత్వం కేవలం ఒకరి కుమార్తెగా కాకుండా, ఒక ఉద్యమకారిణిగా ఏర్పడిందని ఆమె చెప్పకనే చెప్పారు.
ఈ మొత్తం ఎపిసోడ్లో మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు అత్యంత ఘాటుగా ఉన్నాయి. హరీష్ రావును ఉద్దేశించి “హరీష్ నల్లికుట్ల మనిషి.. ఏదైనా ఉంటే స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉండాలి. ఆయనో బబుల్ షూటర్” అని ఆమె మండిపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలు లేదా లోలోపల ఉంటూ హాని చేసే తత్వాన్ని ఉద్దేశించి ఆమె ఈ పదాలను వాడినట్లు అర్థమవుతోంది. తన సొంత బావ, పార్టీ సీనియర్ నేత హరీష్ రావుపై తాను పదే పదే విమర్శలు చేస్తున్నా, పార్టీ అధినేత కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో ఆయన్నే అడగాలని కవిత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ద్వారా.. పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై కేసీఆర్ మౌనం వెనుక మర్మమేమిటనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు.
మొత్తానికి, కవిత వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భావం ఖాయంగా కనిపిస్తోంది. అది రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందా? లేక స్వతంత్ర శక్తిగా నిలబడుతుందా? అనేది వేచి చూడాలి.






