గజ్వేల్ కు కేసీఆర్ గుడ్ బై..! ఉత్తర తెలంగాణ నుంచి పోటీకి ఆసక్తి..!?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎన్నో సంచలనాలు నమోదవుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇన్నాళ్లూ పోటీ చేసిన నియోజకవర్గాలను వదిలిపెట్టేందుకు కొందరు ముఖ్యనేతలు ప్రయత్నిస్తున్నారు. అలాగే కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలుగానూ, ఎమ్మెల్యేలు ఎంపీలుగానూ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ దఫా గజ్వేల్ నుంచి ఉత్తర తెలంగాణకు వెళ్లే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. దీని వెనుక ఎన్నో వ్యూహాలు ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి కేసీఆర్ పోటీకి దిగితే పార్టీకి మరింత లబ్ది చేకూరుతుందనే అంచనాలో ఆయన్ను గజ్వేల్ ను వదులుకునేలా చేస్తున్నాయని తెలుస్తోంది.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి కేసీఆర్ అక్కడి నుంచే పోటీ చేశారు. 2 సార్లూ విజయం సాధించారు. అంతకుముందు 4 సార్లు సిద్ధిపేట నుంచి టీడీపీ, టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారాయన. అంతేకాక కరీంనగర్, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు. 1983లో టీడీపీలో చేరినప్పుడు మినహా కేసీఆర్ ఏ ఎన్నికలోనూ ఓడిపోలేదు. ఇప్పుడు గజ్వేల్ నుంచి మరోసారి పోటీ చేసి హ్యాట్రిక్ కొడతారని అందరూ భావించారు. అయితే కేసీఆర్ ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి కాకుండా కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్ పోటీ చేసి గెలిచారు. కానీ నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడూ అడుగు పెట్టలేదు. ఈసారి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తే ఉత్తర తెలంగాణ మొత్తం పైన ఆయన ప్రభావం కనిపిస్తుంది. బీఆర్ఎస్ కోరుకుంటున్నది కూడా ఇదే. కేసీఆర్ ఉత్తర తెలంగాణ నుంచి పోటీ చేయడం వల్ల మరిన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆయన గజ్వేల్ ను కాదని కామారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
అయితే 2018తో పోల్చితే ఈసారి సీట్లు తగ్గుతాయని బీఆర్ఎస్ భావిస్తోంది. అయినా అధికారానికి ఢోకా లేదని నమ్ముతోంది. కానీ ఎక్కడో ఏదో అనుమానం ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది. అందుకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ తో పాటు వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది. అలాగే హైదరాబాద్ లో కూడా మూడు పార్టీల మధ్య గట్టి ఫైట్ ఉంటుందనుకున్నారు. అలాంటప్పుడు ఈ ప్రాంతాలపైన కాకుండా ఉత్తరాంధ్ర పైన ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. దక్షిణంతో పోల్చితే ఉత్తరాన కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉంది. అందుకే అక్కడ మ్యాగ్జిమమ్ సీట్లు రాబట్టుకోవడం ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. అందుకే ఆయన ఉత్తర తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు దాదాపు రెడీ అయ్యారు.













