కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఖాయమా…?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేస్తారనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలనే పట్టుదలతో పార్టీ పెట్టి చివరకు విజయం సాధించారాయన. 2014లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేస్తూ వచ్చారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. అయితే ఈసారి ఆయన గజ్వేల్ నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో కొంత వాస్తవం ఉందని తాజాగా అర్థమవుతోంది.
మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి వరుసగా రెండు పర్యాయాలు విజయం సాధించారు కేసీఆర్. ఈ నియోజకవర్గంలోనే కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది. కాబట్టి ఇక్కడి నుంచే ఆయన మూడోసారి పోటీ చేసి హ్యాట్రిక్ కొడతారనుకున్నారు. అక్కడ ఆయనకు తిరుగులేదు. ప్రజలు ఆయనకు తిరుగులేని మెజారిటీ కట్టబెట్టడం గ్యారంటీ. అయినా ఆయన సీటు మార్చాలనుకుంటున్నట్టు సమాచారం. దీనికి అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పార్టీకి తిరుగులేని శక్తి జోడించేందుకే కేసీఆర్ ఉత్తర తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఉత్తర తెలంగాణ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటోంది. అయితే ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లను అక్కడ గెలుచుకుంటేనే మళ్లీ అధికారంలోకి రాగలమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదంటే కేసీఆర్ ఉత్తర తెలంగాణ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ పార్టీ నేతల నుంచి వస్తోంది. అందుకే వారి సూచన మేరకు ఆయన ఈసారి కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. కామారెడ్డి నుంచి ప్రస్తుతం గంప గోవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేసీఆర్ ను కామారెడ్డి నుంచి పోటీ చేయాల్సిందిగా నాలుగైదు సార్లు తానే కోరినట్లు గంప గోవర్ధన్ వెల్లడించారు. కేసీఆర్ పూర్వీకులు కామారెడ్డిలోనే ఉండేవారని.. ఆ ఊరు మున్నేరు ముంపునకు గురికావడంతో చింతమడకకు వలస పోయారని ఆయన వివరించారు.
దక్షిణ తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ ఆశించిన మేర సీట్లు రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉండడంతో ఇక్కడ కోల్పోయే సీట్లను ఉత్తర తెలంగాణలో రాబట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తే ఆ ప్రాంతం మొత్తం పైన దాని ప్రభావం పడుతుంది. పార్టీలో మరింత జోష్ తీసుకొస్తుంది. మరిన్ని ఎక్కువ సీట్లు చేజిక్కించుకునేందుకు అవకాశం కలుగుతుంది. పార్టీ నేతల నుండి డిమాండ్లు వస్తుండడం, స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టుబడుతుండడంతో కేసీఆర్ దాదాపు అక్కడి నుంచే పోటి చేయవచ్చని తెలుస్తోంది.













