విపక్షాలకు ధీటుగా కేసీఆర్ సెప్టెంబర్ 17 ప్లాన్..!!
తెలంగాణలో సెప్టెంబర్ 17కు ఎంతో ప్రాధాన్యత ఉంది. విలీన దినమని కొందరు, విమోచమని మరికొందరు, స్వాతంత్ర్యం అని ఇంకొందరు.. ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్లు పిలుచుకుంటున్నారు. వాళ్లదైన స్టైల్ లో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాష్ట్రం విడిపోక ముందు వరకూ తెలంగాణ వాదులంతా దాన్ని అధికారికంగా నిర్వహించాలని సమైక్య పాలకులపై తీవ్ర ఒత్తిడి చేశారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ పాలకులే గద్దెనెక్కారు. కానీ గతేడాది వరకూ సెప్టెంబర్ 17 జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో దీన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది.
నిజాం సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన రోజు సెప్టెంబర్ 17. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు ఏడాదికి నిజాం రాజ్యం దేశంలో భాగమైంది. దానికోసం ఎన్నో పోరాటాలు సాగాయి. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే నిజాం సంస్థానం దేశంలో విలీనమైన రోజును ప్రత్యేకంగా చూస్తారు తెలంగాణ ప్రజలు. తాము అధికారంలోకి వస్తే ఈ దినాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమంలో దీన్ని ఒక ప్రత్యేక అజెండాగా తీసుకున్నారు. కానీ రాష్ట్రం ఏర్పాటైంది. కేసీఆర్ వరుసగా రెండుసార్లు గద్దెనెక్కారు. కానీ దీన్ని పట్టించుకోలేదు.
గతేడాది సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి హాజరయ్యారు. ఈ ఏడాది కూడా దీన్ని అధికారికంగా నిర్వహించబోతోంది కేంద్ర ప్రభుత్వం. అమిత్ షా రాబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా సెప్టెంబర్ 17ను స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అగ్ర నాయకత్వమంతా ఈ సమావేశంలో పాల్గొనబోతోంది. ఇలా బీజేపీ, కాంగ్రెస్ సెప్టెంబర్ 17ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
విపక్షాలు సెప్టెంబర్ 17ను ప్రాధాన్యతాంశంగా తీసుకోవడంతో కేసీఆర్ కూడా అలెర్ట్ అయ్యారు. వాస్తవానికి గతేడాది బీజేపీ ఈ రోజును అధికారికంగా నిర్వహించడంతో కేసీఆర్ కూడా దీన్ని జాతీయ సమైక్యత దినంగా ప్రకటించింది. ఈ ఏడాది కూడా దీన్ని అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే అదే రోజు హైదరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ సభలు ఉండడంతో.. ఆ రోజు కాకుండా మరుసటిరోజు భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేశారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం సెప్టెంబర్ 18న భారీ బహిరంగసభ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేస్తూ కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. ఇలా సెప్టెంబర్ 17ను వాడుకోబోతున్నారు కేసీఆర్.













