భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు సహా, వివిధ అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌తో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్, భద్రాచలం వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాని ఆదేశించారు. ధాన్యం ఉత్పత్తి మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.













