‘ఉద్యమ సూరీడు’ కి అగ్నిపరీక్ష
పదేళ్ల క్రితం.. కేసీఆర్ ఒక్క పిలుపిస్తే చాలు .. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేవారు. ఉద్యమం సందర్భంగా రాజీనామాలు చేస్తే… ఉపఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించేవారు. దీంతో కేసీఆర్ కు.. తెలంగాణలో తిరుగులేదన్న మాట నానుడిగా మారింది. తొలిసారి పోటీ చేసినప్పుడు వచ్చిన సీట్లతో పోలిస్తే… రెండోసారి అత్యధిక స్థానాలను సాధించింది. ఇప్పుడు వందస్థానాలతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. కానీ పరిస్థితులు మాత్రం ఈసారి అంత ఆశాజనకంగా లేనట్లు తెలుస్తోంది.
అందరి సంగతి ఎందుకు..? సాక్షాత్తూ సీఎం కేసీఆర్.. రెండుచోట్ల పోటీ చేస్తున్నారు.. ఎప్పుడు ఏదో ఓస్థానం నుంచి పోటీ చేసే కేసీఆర్.. ఈసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం కూడా సంచలనమైంది. ఒకటి తను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కాగా, రెండోది తొలిసారి తలపడుతున్న కామారెడ్డి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ రాజకీయాలు గరంగరంగా సాగుతున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నుంచి బలమైన నాయకులే.. కేసీఆర్పై తలపడుతుండడం పోటీ మరింత రసవత్తరంగా మారింది.
దీంతో కేసీఆర్ రెండు నియోకవర్గాల్లోనూ గెలుపు కోసం శ్రమించాల్సి వస్తోంది. గతానికి భిన్నంగా గజ్వేల్లో తాను చేసిన అభివృద్ధిని చెప్పుకొంటున్నారు. 2014 నుంచి ఇక్కడ జరిగిన మంచిని, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఏకరువు పెడుతున్నారు. ఇక, కామారెడ్డిలో సెంటిమెంటును పండిస్తున్నారు. ఇది తన తల్లి జన్మస్థానమని, దీనితో తనకు పేగు బంధం ఉందని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ గెలుపు కోసం.. ఆయన క్షేత్రస్థాయి నాయకులను ఏకం చేస్తున్నారు. నిరంతరం మానిటరింగ్ కూడా చేస్తున్నారు.
ఇంతవరకూ ఓటమెరుగని కేసీఆర్.. ఇప్పుడు ఓడితే, ఆయనకు ప్రజాశీర్వాదం పోయిందని విపక్షాలు విమర్శలు చేసే అవకాశముంది. అప్పుడు వాటిని కంట్రోల్ చేయడంకూడా కష్టమన్నది కేసీఆర్ కు బాగా తెలుసు. దీంతో దొరికిన స్వల్ప విరామాన్ని సైతం ఆయన ఫామ్ హౌస్ నుంచే వినియోగించుకుంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను ఎలా ఫేస్ చేయాలన్నదానిపై పక్కా వ్యూహాలు పన్నుతున్నారు. అయితే..ఇద్దరూ బలమైన నాయకులు కావడంతోపాటు.. సామాజిక వర్గాల పరంగా కూడా ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో కేసీఆర్ ఈ రెండు చోట్లా చెమటోడుస్తున్నారనే చెప్పాలని అంటున్నారు బీఆర్ ఎస్ నాయకులు.













