హస్తమే ప్రత్యామ్నాయమా?
బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఏమిటో కేసీఆర్ తేల్చేశారా? నాగర్ కర్నూల్ సభలో సీఎం వ్యాఖ్యలు చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతోంది. సభ మొత్తం కాంగ్రెస్ పైనే కేసీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నిజమైన అభివృద్ధి జరుగుతోందన్న కేసీఆర్.. కాంగ్రెస్ హయాంలో దళారులు, పైరవీకారులదే భోజ్యమన్నారు. అంతేకాదు.. మళ్లీ మాయమాటలు చెబుతూ మింగేయడానికి వస్తున్నారని.. ప్రజలు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ఓడగొట్టుకోకూడదని సూచించారు.
కర్నాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో పెల్లుబుకుతున్న ఉత్సాహం.. ప్రజలు కూడా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నే చూస్తున్నారన్న విషయం అర్థం కాబట్టే కేసీఆర్.. కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని హస్తం పార్టీనేతలు చెబుతున్నారు.అంతే కాదు.. ఇటీవలి కాలంలో తమతో చాలా మంది బీఆర్ఎస్, బీజేపీనేతలు టచ్ లో ఉన్నారని.. సరైన సమయంలో వారికి గేట్లు తెరుస్తామంటున్నారు. ఇప్పటికే పొంగులేటి, జూపల్లికి కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ముఖ్యంగా కాంగ్రెస్ దళితుల ఓట్లపైనే ఫోకస్ పెట్టింది. ఎందుకంటే.. కేసీఆర్ దళిత వ్యతిరేకి అంటూ ప్రచారం కొనసాగిస్తున్న కాంగ్రెస్.. అటవీశాఖ అధికారుల సాయంతో కేసీఆర్ భూములు లాక్కుంటున్నారని ఆరోపిస్తోంది. దళితులపై జరుగుతున్న అకృత్యాలను ప్రస్తావిస్తోంది. కాంగ్రెస్ హయాంలోనే దళితులకు రక్షణ ఉంటుందన్న విషయాన్ని మరోసారి ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారం నిర్వహిస్తోంది.
పీసీసీ చీఫ్ రేవంత్ సహా కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు చాలా మంది ఉన్నారు. దీనికి తోడు ఈసామాజిక వర్గం.. ఈసారి కాంగ్రెస్ వైపు చూస్తోందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవలి కాలంలో మంత్రి మల్లారెడ్డి సహా కొందరు రెడ్డినేతలకు.. ఆ సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా రెడ్డి, దళిత, ఇతర వర్గాల ఓట్లను సాధించడ గలిగితే.. తాముకుంటున్న80 సీట్లను సాధించడం పెద్ద కష్టం కాదని కాంగ్రెస్ భావిస్తోంది.













