కవిత చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..! అరెస్టు తప్పదా…?
ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు రెండేళ్లుగా ఇది నానుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో కొందరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి జైలుకు పంపించింది సీబీఐ. ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అరవింద్ కేజ్రివాల్ ను ఈడీ వెంటాడుతోంది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రివాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో అరెస్టు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. మరోవైపు ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చింది సీబీఐ.
ఢిల్లీ లిక్కర్ స్కాం కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చింది. దాదాపు ఏడాది తర్వాత ఈ కేసు మళ్లీ ఓపెన్ అయిందని చెప్పొచ్చు. గతంలో కొన్నిసార్లు విచారణకు హాజరైంది కవిత. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ఈ కేసు తెరమరుగైపోయింది. కోర్టులు కూడా ఈ కేసు విచారణకు బ్రేక్ వేయడంతో ఆగింది. అయితే ఇప్పుడు సీబీఐ మళ్లీ దూకుడు పెంచింది. తాజాగా ఈ నెల 26న విచారణకు రావాల్సిందిగా కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది.
గతంలో 2022 డిసెంబర్ 11న సీబీఐ హైదరాబాద్ లోని కవిత నివాసంలోనే ఆమెను విచారించింది. ఆ తర్వాత 2023 మార్చిలో ఈడీ రంగంలోకి దిగి కవితకు నోటీసులు ఇచ్చింది. దీంతో మార్చి 11న ఢిల్లీలో ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరైంది. ఆ తర్వాత 16న విచారణకు మళ్లీ రావాలని ఈడీ కోరింది. అయితే ఇంతలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. తనను విచారించేందుకు ఇంటి వద్దకే రావాలని ఆదేశాలివ్వాల్సిందిగా కోరారు. అయితే దీన్ని పట్టించుకోని ఈడీ 20, 21న మరో రెండు దఫాలు విచారించింది. కవితకు చెందిన 11 ఫోన్లు, బ్యాంకు ఖాతాలు, వ్యాపార లావాదేవీల వివరాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. సౌత్ గ్రూప్ ఏర్పాటు, ఢిల్లీ ప్రభుత్వానికి దానికి మధ్య జరిగిన లావాదేవీలపై ఈ విచారణ కొనసాగినట్లు సమాచారం. అయితే సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో ఈడీ ముందుకు వెళ్లలేకపోయింది.
ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగి 26న విచారణకు రావాలని ఆదేశించింది. 41ఏ సీఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చినట్టు సీబీఐ కోర్టుకు వెల్లడించింది. అంతేకాక ఈ కేసులో కవిత పాత్ర ఉన్నందున నిందితురాలిగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. దీంతో కవిత అరెస్టు తప్పదేమో అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రా రెడ్డి తదితరులు జైలుకు కూడా వెళ్లారు.













