కవితకు ఈడీ తాజా నోటీసులు.. 10న అరెస్టు ఖాయమా..?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకూ 10 మందిని అరెస్టు చేసిన ఈడీ, సీబీఐ.. మరికొంతమందిని అదుపులోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మనీశ్ సిసోడియా, రామచంద్ర పిళ్లై అరెస్టుల తర్వాత కచ్చితంగా నెక్స్ట్ అరెస్ట్ కవితదే అని ఊహిస్తున్నారు. ఇప్పుడామెకు ఈడీ నోటీసులు ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. ఆమెను అరెస్టు చేసేందుకే ఈడీ విచారణకు పిలిచిందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో సౌత్ గ్రూప్ ప్రధాన పాత్ర పోషించిందనేది సీబీఐ ప్రధాన ఆరోపణ. మాగుంట శ్రీనివాస రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి, కవిత, శరత్ చంద్రా రెడ్డి తదితరులు సౌత్ గ్రూప్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సౌత్ గ్రూప్ వ్యవహారాలను చక్కబెట్టడంలో రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, బినోయ్ బాబు తదితరులు కీలక పాత్ర పోషించారు. వీళ్లంతా పాలసీ రూపకల్పనలో పాల్గొన్నారని, అందిన లబ్దిని ఆప్ నేతలకు అందేలా చూసుకున్నారనేది సీబీఐ ఆరోపణ. ముఖ్యంగా వంద కోట్ల రూపాయల ముడుపులు ఆప్ నేతలకు అందాయని ఈడీ చెప్తోంది.
నగదు లావాదేవీలకు సంబంధించి ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు, రాఘవ రెడ్డి తదితరుల పాత్ర ఉందని ఈడీ తేల్చింది. ముఖ్యంగా రామచంద్ర పిళ్లై నేరాన్ని అంగీకరించారని ఈడీ ఛార్జ్ షీటులో పేర్కొంది. పిళ్లై ఛార్జ్ షీటులో పలుమార్లు కవిత పేరు ప్రస్తావించింది. తాను కవిత బినామీయేనని.. ఆమె చెప్పినట్లే నడుచుకున్నానని రామచంద్ర పిళ్లై చెప్పినట్లు ఈడీ ఛార్జ్ షీటులో వెల్లడించింది. దీంతో కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
అనుకున్నట్టే ఎమ్మెల్సీ కవతకు ఈడీ నోటిసులు అందించింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. రేపు విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేస్తారని అందరూ భావిస్తున్నారు. కవిత మాత్రం అరెస్టులకు భయపడేది లేదని.. తాను ఏ తప్పూ చేయలేదని చెప్తున్నారు. ఈడీ మాత్రం సౌత్ గ్రూపులో కవిత కూడా కీలక పాత్రధారని అని స్పష్టం చేస్తోంది. మరి ఈ వ్యవహారం మున్ముందు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందనేది వేచి చూడాలి.













