బలమా? బలహీనతా?
అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల గడువున్నా సీఎం కేసీఆర్.. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం వెనక ఎలాంటి వ్యూహముంది? 115 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం తమ పార్టీ పటిష్టతకు నిదర్శనమని కేసీఆర్ చెబుతున్నారు. పార్టీ వర్గాలు సైతం ఇదే తరహాలో కామెంట్స్ చేస్తున్నాయి.అయితే ముందస్తుగా మొత్తం అభ్యర్థులను ప్రకటించడం కేసీఆర్ బలం కాదని, బలహీనతలా కనిపిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే…సిట్టింగులను మార్చే సాహసం కేసీఆర్ చేయలేకపోయారని గుర్తు చేస్తున్నారు.
దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలున్నాయి. అందులో ఒకరిద్దరిపై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. అయినా సరే వారందరికీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా సీట్లిచ్చారు. ఎందుకంటే… ఆయా స్థానాల్లో వారిని తప్ప, వేరే వ్యక్తిని నిలబెడితే గెలిచే పరిస్థితి లేదని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. అలా అని వారేమైనా నిజాయితీ పరులా అంటే.. సాక్షాత్తూ సీఎం కేసీఆర్, వారు అవినీతి పరులని తేల్చారు. అంతే కాదు.. వారిపై క్షేత్రస్థాయిలోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటప్పుడు… వారందరికీ ఎలా సీట్లు వచ్చాయి. అంటే ఎందుకొచ్చిన గొడవని ..ఉన్నవారితో కేసీఆర్ సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తామంటూ బీఆర్ఎస్ చీఫ్… చాలా సార్లు ప్రకటించారు. పదేపదే సర్వేలు చేయించారు. పనితీరు మార్చుకోవాలంటూ పదేపదే ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పలువురు సిట్టింగులను మార్చేస్తారంటూ సంకేతాలిచ్చారు. తీరా చూస్తే..వారందరికీ టికెట్లు వచ్చాయి. అంటే సర్వేలు ఏమయ్యాయి?అన్ని బుట్టదాఖలయ్యాయా? మరి ఆమాత్రం దానికి సర్వేలెందుకు? లీకులెందుకని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. ముందే సిట్టింగులకు టికెట్లని ప్రకటిస్తే సరిపోయేదంటున్నారు.
ప్రస్తుతం పరిస్థితిని చూస్తే, సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ ఆర్థికంగా పటిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు పెట్టగలరు.. అంతేకాదు.. పార్టీకీ కావాల్సిన ఫండ్ ఇచ్చేసామర్థ్యం కూడా ఉంది. ఇటీవలే జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో వెయ్యకోట్లకు పైగా ఖర్చయ్యాయి. ఈపరిస్థితుల్లో డబ్బున్నవారికే టికెట్లు కేటాయిస్తే, సరిపోతుందని బీఆర్ఎస్ చీఫ్ భావించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సిట్టింగులకే సీట్లివ్వకుంటే వారు.. రాజీనామాలు చేసే పరిస్థితి ఉంటుందని.. ఇది మరింత సంక్షోభానికి దారితీస్తుందన్న భయం కూడా కావొచ్చని సమాచారం.













