ఢిల్లీలిక్కర్ స్కాంలో కవితకు నోటీసుల వెనక..?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 26న విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది. లిక్కర్ స్కామ్ లో కవిత భారీగా ఆస్తులు సంపాదించారని గత చార్జిషీట్ లో సీబీఐ తెలిపింది. గతంలో రెండుసార్లు కవిత ఇంటికే వెళ్లి విచారణ చేసింది సీబీఐ. తర్వాత అంతా సైలెంటైంది. మళ్లీ ఇప్పుడు నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది. అయితే ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు పక్కాగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవితను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లుగానే కవిత సైతం. ఢీ అంటే ఢీ అన్నట్లు ప్రకటనలు చేశారు. అప్పట్లో మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావు మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోనే మకాం వేసి, ఎప్పటికప్పుడు పరిస్థితి అధ్యయనం చేశారు. అయితే అప్పుడు కవితకు నోటీసులతోనే అయిపోయింది. ఎందుకంటే అప్పుడు కవితను అరెస్ట్ చేస్తే.. దాన్ని బీఆర్ఎస్ ఎక్కడ ప్రచారంలో వాడుకుంటుందో అన్న అనుమానం .. కేంద్రం, లోకల్ బీజేపీ నేతలకు ఉన్నట్లు ప్రచారం జరిగింది. అది అంతిమంగా బీఆర్ఎస్ కు రాజకీయ ప్రయోజనం చేకూరే పరిస్థితి ఉండడంతో.. కేంద్రం వెనకడుగు వేసిందన్న ప్రచారం ఉంది.
ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీఆర్ఎస్ కు బద్ధశత్రువుగా ఉన్న కాంగ్రెస్ .. పగ్గాలు చేపట్టింది. దీనికి తోడు ఎప్పుడు దొరికితే అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిని.. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ఉతికారేస్తున్నారు. ఓరకంగా చెప్పాలంటే ప్రస్తుతం పరిస్థితి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లా లేదు. రేవంత్ వర్సెస్ కల్వకుంట్ల కుటుంబంలా మారింది. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికల సమయం వచ్చేసరికి.. బీఆర్ఎస్ పరిస్థితి రాజకీయంగా దిగజారుతోంది. దీంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు చిగురించిందని, ఇరుపార్టీలు కలిసి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది.
ఈ సమయంలో బీఆర్ఎస్ ను కాంగ్రెస్, బీజేపీ .. రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటప్పుడు కవితను అరెస్ట్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేయగలిగితే .. బీజేపీకి రెండు లాభాలు కనిపిస్తున్నాయి. ఒకటి బీఆర్ఎస్ .. రాజకీయంగా మరింత ఇబ్బందుల్లోకి పడుతుంది. ఇదే అదనుగా బీజేపీని మరింత బలోపేచం చేసేందుకు ఛాన్స్ దొరకనుంది. దీనికి తోడు బీఆర్ఎస్ తో తమకు బంధం లేదన్న విషయం తేటతెల్లమవుతుందన్న భావనలో రాష్ట్రనేతలున్నారు.
అదీకాక… కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కేసీఆర్ పీకల్లోతున కూరుకుపోయి ఉన్నారు. ఆ ప్రాజెక్టు గురించి ప్రజల ముందు మాట్లాడలేని దుస్థితి దాపురించింది. దీంతో ఇప్పుడు కవితను విచారించి అరెస్ట్ చేసినా.. ప్రజల నుంచి పెద్దగా సానుభూతి దక్కదని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇప్పుడు ఓవేళ కవితను అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది..? ఆపార్టీ ఎలాంటి కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టనుంది. ఇక దీన్ని కాంగ్రెస్ ఎలా డీల్ చేయనుంది. బీజేపీ ఎలా సమర్థించుకుంటుంది. ఇవన్నీ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి.













