మైనంపల్లిపై వేటు ఖాయం..! మల్కాజిగిరి అభ్యర్థి ఇతనే..!!?
తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ మైనంపల్లి హనుమంత రావే. ఆయన్ను బీఆర్ఎస్ ఏం చేయబోతోంది.. ఆయన ఎటువైపు అడుగులు వేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాను చేసిన కామెంట్స్ విషయంలో మైనంపల్లి హనుమంత రావు వెనక్కు తగ్గకపోవడం.. తన డిమాండ్లపై పట్టు వీడకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకే బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. రెండు మూడు రోజుల్లోనే ఆయనపై వేటు వేసి మల్కాజిగిరికి కొత్త అభ్యర్థిని ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ జాబితాలో కొన్ని మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
మంత్రి హరీశ్ రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన కామెంట్స్ ఇంకా కాక రేపుతూనే ఉన్నాయి. పైగా తాను చేసిన కామెంట్స్ పై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని మైనంపల్లి హనుమంతరావు మరోసారి స్పష్టం చేశారు. అంతేకాక.. తనను గిల్లితే తాను కూడా గిల్లుతానని బహిరంగంగానే చెప్పేశారు. అయినా మైనంపల్లిని వదులుకోవడం ఇష్టంలేని కేసీఆర్.. రాయబారానికి పంపారు. కొడుకు మైనంపల్లి రోహిత్ కు ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ చేశారు. అయితే ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా మీడియాకు చెప్పాలని మైనంపల్లి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో విసుగెత్తిపోయిన కేసీఆర్.. ఆయనపై వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
మైనంపల్లిపై వేటు వేస్తే అక్కడ ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై బీఆర్ఎస్ లో జోరుగా చర్చ జరుగుతోంది. అక్కడి నుంచి మంత్రి మల్లారెడ్డి మేనల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని బరిలోకి దింపాలని కొందరు సూచించారు. అయితే ఆయన కంటే శంభీపూర్ రాజుకు టికెట్ ఇస్తే బాగుంటుందని మరికొందరు సలహా ఇచ్చారు. శంభీపూర్ రాజు ఎంతోకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఈసారి తనకు శేరిలింగంపల్లి టికెట్ వస్తుందని ఎంతో ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో శంభీపూర్ రాజు మరోసారి నిరాశకు గురయ్యారు. అందుకే మైనంపల్లి స్థానంలో శంభీపూర్ రాజుకు అవకాశం కల్పించాలని కేసీఆర్ దాదాపు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
శంభీపూర్ రాజు తాజాగా మంత్రి హరీశ్ రావుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. టికెట్ విషయం చర్చించేందుకే ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగాల్సిందిగా శంభీపూర్ రాజుకు హరీశ్ రావు సూచించారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ఇంకో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మైనంపల్లిపై వేటు వేసిన తర్వాత మల్కాజిగిరి నుంచి శంభీపూర్ రాజును కూడా ఆ నాలుగు స్థానాలతో కలిపి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ వారంలోనే రెండో జాబితా ప్రకటన ఉంటుందని సమాచారం. మరి ఇదే జరిగితే మైనంపల్లి ఏ పార్టీలో చేరతారనేది వేచి చూడాలి.













