బీఆర్ఎస్ పోడు అస్త్రం..
ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రధాన అస్త్రాన్ని ప్రయోగించింది. పోడురైతుల సమస్యను పరిష్కరిస్తామని చెబుతూ వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రధాన అస్త్రంగా సంధించింది. అదీ మామూలుగా కాదు ఏకంగా నాలుగున్నర లక్షల ఎకరాలను పోడు భూముల లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని ప్రకటించింది. ముఖ్యమంత్రి స్వయంగా 12 మంది లబ్దిదారులకు పోడుపట్టాలు పంపిణీ చేయడంతో పాటు రైతుబంధు చెక్కులు అందించారు. దీంతో పోడు రైతుల కష్టాలకు చెక్ పడుతుందన్నారు. ఇక ఏ అటవీ అధికారి.. ఆదివాసీల భూములపైకి వచ్చే ప్రసక్తే ఉండదని భరోసా ఇచ్చారు.
కొన్నేళ్లుగా రాష్ట్రంలో పోడు సమస్య తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో ఆదివాసీలు, అటవీశాఖ అధికారుల మధ్య దాడులు జరుగుతున్న పరిస్థితులున్నాయి. అదెంతవరకూ వెళ్లిందంటే ఏకంగా అటవీ అధికారి శ్రీనివాసరావును.. గుత్తికోయలు హత్య చేసేంతవరకూ. దీంతో అటవీశాఖ అధికారులు,సిబ్బందిలో వణుకు ప్రారంభమైంది. ప్రభుత్వం ఓవైపు హరితహారం పేరుతో పోడు రైతుల నుంచి భూములు లాక్కుంటోందని.. దీనికి అటవీ అధికారులను ఆదివాసీ రైతులపైకి ఉసిగొల్పుతోందని గతంలో విపక్షనేతలు.. అసెంబ్లీ వేదికగా ఆరోపించారు.
దీనికి తోడు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలకు ఆదివాసీ ల నుంచి నిరసనలు తగులుతున్నాయి.చాలా ప్రాంతాల్లోకి ఎమ్మెల్యేలు అడుగుపెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు.. అనుకూలంగా మార్చుకుంటున్నారన్న నిఘావర్గాల రిపోర్టులతో.. బీఆర్ఎస్ సర్కార్ అప్రమత్తమైంది. ఎన్నికల ముందు వరుసగా సంక్షేమపథకాలు అమలు చేస్తూ ముందుకెళ్తోంది. దీనిలో భాగంగాపోడు సమస్యకు పరిష్కారం చూపే దిశగా.. పట్టాల పంపిణీ చేపట్టింది. దీనిపై లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
మరోవైపు.. బీఆర్ఎస్ సర్కార్ ఆర్భాటంగా పథకాలు చేపడుతుందని.. ఏదీ పూర్తిగా చేయదని విపక్షాలు కౌంటర్స్ స్టార్ట్ చేశాయి. దీనికి దళితబంధునే ప్రధాన ఉదాహరణగా చూపిస్తున్నాయి. కొద్దిమందికి ఇచ్చి ప్రచారం చేయించుకోవడంలో భాగంగానే దీన్ని చూస్తున్నామని కుండబద్దలు కొడుతున్నాయి. తాము అధికారంలోకి వస్తేనే పోడు రైతులకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్, బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఆదివాసీరైతులకు.. బీఆర్ఎస్ నేతల నిజస్వరూపం అర్థమైందని, వారెప్పటికీ కేసీఆర్ ను నమ్మరంటున్నారు.













