పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవంపై కేసీఆర్ కీలక నిర్ణయం..!
పార్లమెంట్ కొత్త భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. అయితే ఈ భవన ప్రారంభోత్సవంపై ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రధాని కాకుండా రాష్ట్రపతితే ఈ భవనాన్ని ప్రారంభింపజేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ అంటే ప్రధాని కాదని, రాష్ట్రపతి, లోక్ సభ, రాజ్యసభ కలిస్తేనే పార్లమెంట్ అని గుర్తు చేస్తున్నాయి. మోదీ మాత్రం పార్లమెంట్ కు కొత్త అర్థం చెప్తున్నారని ఎద్దేవా చేస్తున్నాయి. మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా 19 విపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి.
కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత అటూఇటూ ఉన్న చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ లాంటి పార్టీలు కూడా కాంగ్రెస్ కు జై కొట్టాయి. పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ మాటకు సంఘీభావం ప్రకటించాయి. ఆ పార్టీతో కలిసి బహిష్కరించేందుకు తాము కూడా సై అన్నాయి. అయితే ఇంతకాలం కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకతాటి పైకి తెచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా శ్రమించారు. అయితే కర్నాటక ఫలితాల తర్వాత కేసీఆర్ తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన పార్టీలన్నీ కాంగ్రెస్ తో కలిసిపాయాయి. కేసీఆర్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. దీంతో ఆయన ఎటువైపు వెళ్తారోననే ఉత్కంఠ మొదలైంది.
పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ హాజరవుతుందా.. లేదా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ చారిత్రక ఘట్టానికి తాము కూడా దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ మాట వినని ప్రాంతీయ పార్టీలపైకి దర్యాప్తు సంస్థలను వదిలి కక్ష సాధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గద్దె దించాలని కేసీఆర్ గట్టిగా కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి హాజరైతే అది తప్పుడు సంకేతాలిస్తుందని కేసీఆర్ భావించారు. అందుకే ఆ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించారు.
బీజేపీని గద్దె దించాలనే పట్టుదలతోనే టీఆర్ఎస్ ను సైతం బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. పైగా ఢిల్లి లీక్కర్ స్కామ్ లో కుమార్తె కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో ఆరు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. కేసీఆర్ పై బీజేపీ ఒంటికాలిపై లేస్తోంది. ఇలాంటప్పుడు బీజేపీతో అంటకాగితే మరిన్ని సమస్యలు వస్తాయని భావించారు కేసీఆర్. అందుకే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉండాలని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పటి పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.













