భారతదేశంలో కూడా అలాంటి విధానం రావాలి : సీఎం కేసీఆర్
అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల సభలు జరగవని, టీవీల్లో నాయకుల చర్చలు విని ప్రజలు నిర్ణయానికి వస్తాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ భారతదేశంలో కూడా అలాంటి విధానం రావాలని అభిప్రాయపడ్డారు. నవంబర్ 30న పోలింగ్ డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు. అంతటితో మా పని అయిపోయింది అని ప్రజలు అనుకోవద్దు. అప్పటినుంచే అసలు ప్రక్రియ మొదలు అవుతుంది. ఎవరి చేతుల్లో ఉంటే రాష్ట్రం బాగుంటుందో ప్రజలు ఆలోచించాలి. అలా ఆలోచించి ఓటు వేస్తే మంచి చేసే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. సింగరేణిని ముంచిందే కాంగ్రెస్. కాంగ్రెస్ నేతలకు చేతకాక సమైక్య నేతల చేతుల్లో పెడితే వారు కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన అప్పులను కట్టలేక 49 శాతం సంస్థ వాటాను కేంద్రానికి అప్పజెప్పారు ఈ కాంగ్రెస్ నేతలు అని అన్నారు.
తెలంగాణ రాగానే ఎంతో మంది ఆర్థికవేత్తలు, నిపుణులతో సంప్రదింపులు జరిపాం. తెలంగాణ మొత్తం ఆగం అయింది. ఇప్పుడు రాష్ట్రానికి ఒక దశ దిశ కావాలని వారిని అడిగి ఎన్నో సలహాలు తీసుకున్నాం. అందుకు అనుగుణంగానే పేదల సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు. రాష్ట్ర సంపద పెరుగుతున్నా కొద్దీ ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ పదేళ్లు సుపరిపాలన సాగించాం. ఇవాళ తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉంది. ఎన్నో అంశాల్లో దేశానికి దిక్సూచిగా ఉంది. ఇదే తరహాలో మంచి పాలన తెలంగాణలో కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ హయాంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని బేరీజు వేసుకొని ఓటు వేయండి అని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.













