బిజెపి వర్సెస్ బీఆర్ఎస్; ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసే వారిని టార్గెట్ చేసారా…?
తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సిఎం కేసీఆర్ సహా అధికార పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతుంది. అయితే అనుకున్న విధంగా పరిస్థితులు బిజెపికి కలిసి రావడం లేదు. పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారం బిజెపికే తిరిగి చుట్టుకోవడంతో సిఎం కేసీఆర్ ను తక్కువ అంచనా వేయవద్దని బిజెపి ఒక క్లారిటీ కి వచ్చింది. లిక్కర్ కేసుకి సంబంధించి కవితను అరెస్ట్ చేయాలని చూసినా అందుకు పరిస్థితులు కలిసి రావడం లేదు దర్యాప్తు సంస్థలకు. దీనితో కవితను ధాటి సిఎం అరవింద్ కేజ్రీవాల్ వరకు వెళ్ళింది విచారణ.
ఆయనకు ఇప్పటికే సిబిఐ నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బిజెపి ముందు మరో ప్లాన్ ఉందని దాన్ని అమలు చేసేందుకు అన్ని విధాలుగా బిజెపి నేతలు ప్లాన్ రెడీ చేసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జిల్లాల వారీగా కీలక నాయకులను ఆర్ధికంగా బలంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని ఇతర రాష్ట్రాల్లో వారికి ఉన్న వ్యాపారాలను ఫోకస్ చేసుకుని అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అధికార పార్టీలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలకు కర్ణాటక లో వ్యాపారాలు ఉన్నాయని సమాచారం.
ఆ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేసే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డి మీద అప్పట్లో డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. దాని మీద కూడా బిజెపి ప్లాన్ రెడీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే మహారాష్ట్రలో వ్యాపారాలు చేసే అధికార పార్టీ నాయకులను కూడా గురిపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ నేతలను కూడా కొందరిని లక్ష్యంగా చేసుకుని పార్టీలోకి తీసుకోవాలని బిజెపి ప్లాన్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది.













