చీకోటి ప్రవీణ్‌కు చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన బీజేపీ..!!
చీకోటి ప్రవీణ్.. పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యాసినో కింగ్ గా పేరొందిన చీకోటి ప్రవీణ్ కొంతకాలంగా వార్తల్లో ఉంటున్నారు. క్యాసినో ప్రేమికులను గోవా, థాయిల్యాండ్, శ్రీలంక తదితర ప్రదేశాలకు తీసుకెళ్లి గేమ్ ఆడించడం చీకోటి ప్రవీణ్ వ్యాపారం. దీంతో ఈయనకు పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈయనపై అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్రమంగా హైదరాబాద్, గుడివాడ లాంటి ప్రదేశాల్లో క్యాసినోలు నిర్వహిస్తుంటారనే ఫిర్యాదులు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసుల్లో చీకోటి ప్రవీణ్ నిందితుడిగా ఉన్నారు. అయితే ఆయన రాజకీయాల్లోకి రావాలనుకోవడం తాజా ట్విస్ట్.
చీకోటి ప్రవీణ్ కొంతకాలంగా రాజకీయాల్లోకి రావాలని తహతహలాడుతున్నారు. ఆయన హిందుత్వ వాది. కాబట్టి కచ్చితంగా బీజేపీలో తప్ప మరేపార్టీలో చేరబోరని ముందే అర్థమైంది. అయితే బీజేపీలో ఆయన ఎప్పుడు చేరతారు.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. లాంటి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎట్టకేలగు ఇవాళ అంటే సెప్టెంబర్ 12న చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. భారీ ర్యాలీ ద్వారా బీజేపీ కార్యాలయానికి చేరుకుని అక్కడ పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరాలని చీకోటి ప్రవీణ్ ప్లాన్ చేసుకున్నారు.
అనుకున్నట్టుగానే భారీ ర్యాలీ ద్వారా చీకోటి ప్రవీణ్ బీజేపీ ఆఫీసుకు చేరుకున్నారు. అయితే అక్కడ ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు ఎవరూ లేరు. వాస్తవానికి ఆయన కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరాల్సి ఉంది. ఇందుకోసం ఉదయం నుంచి ఏర్పాట్లు జరిగాయి. అయితే చివరి నిమిషంలో చీకోటి ప్రవీణ్ కు బీజేపీ నేతలంతా హ్యాండ్ ఇచ్చారు. దీంతో చీకోటి ప్రవీణ్ చేరికపై సందిగ్ధత నెలకొంది. హంగామాతో పార్టీ ఆఫీసుకు చేరుకున్న చీకోటి ప్రవీణ్ .. అక్కడి పరిస్థితి చూసి అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు జరిగిందో తెల్సుకోకుండా బయటకు అడుగు పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
అయితే చీకోటి ప్రవీణ్ చేరికపై రాష్ట్రవ్యవహారాల ఇన్ ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చీకోటి ప్రవీణ్ చేరిక కోసం రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న హడావుడి చూసి ఆయన రాష్ట్ర నేతలకు వార్నింగ్ ఇచ్చారని సమాచారం. దీంతో చీకోటి ప్రవీణ్ ను చేర్చుకునేందుకు కార్యాలయానికి వచ్చిన ఈటల రాజేందర్ కాసేపటికే ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కిషన్ రెడ్డి అసలు పార్టీ ఆఫీసుకు రాకుండానే ఉండిపోయారు. అయితే ప్రకాశ్ జవదేకర్ ఎందుకు అభ్యంతరం తెలిపారు.. చేరిక వాయిదా మాత్రమే పడిందా.. లేకుంటే చీకోటిని అసలు పార్టీలో చేర్చుకునే ఉద్దేశమే లేదా.. అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు దొరకాల్సిన పరిస్థితి ఏర్పడింది.













