తెలంగాణలో స్పీడ్ పెంచుతున్న బీజేపీ.. ఈ నెలలో 3 భారీ బహిరంగసభలు..!!
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపొందడమే బీజేపీ ఏకైక లక్ష్యం. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడంచాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. ఇందుకోసం అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. కర్నాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై పడకుండా జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగా ఈ నెలలో మూడు భారీ బహిరంగసభలు ఏర్పాటు చేయాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. ఈ సభలకు జాతీయ అగ్రనేతలను తీసుకురావడం ద్వారా తామే అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాలను పంపించాలనుకుంటోంది.
దక్షిణ భారతంలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటకలో బీజేపీ ఓడిపోయింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ కన్ను తెలంగాణపై పడింది. తెలంగాణలో డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా దక్షిణభారతంలో తమ ఉనికిని మరింత విస్తరింపజేసుకోవాలనే ఆలోచనతో ఉంది బీజేపీ. ఇందుకోసం పార్టీ కార్యక్రమాలను విస్తృత పరచాలని నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు జాతీయ నేతలు తెలంగాణలో వివిధ సందర్భాల్లో పర్యటించారు. సౌతిండియాలో మరే రాష్ట్రానికీ ఇవ్వని ప్రాధాన్యత తెలంగాణకు ఇస్తున్నారు.
మోదీ పాలనకు తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసి ఈ తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేయాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా పలువురు అగ్రనేతలు వివిధ రాష్రాల్లో పర్యటించి భారీ బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి సభలను మూడు చోట్ల ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది. 15న ఖమ్మంలో అమిత్ షా, 25న నాగర్ కర్నూలులో జేపీ నడ్డా సభలకు ముహూర్తం ఖరారైంది. ప్రధాని మోదీచే ఒక సభ నిర్వహించాలని టీబీజేపీ భావిస్తోంది. దానికి సంబంధించి మహుర్తం, వేదిక ఖరారు కావాల్సి ఉంది.
మోదీ తొమ్మిదేళ్ల పాలన విజయాలను వివరించే మహాజన సంపర్క్ అభియాన్ పేరిట సభలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నా.. తెలంగాణలో మాత్రం ఈ సభలు పూర్తిగా రాజకీయ సభలే. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ సభలను ఏర్పాటు చేస్తున్నట్టు అర్థమవుతోంది. తమ బలాలు, బలహీనతలను అంచనా వేసుకుని వీక్ గా ఉన్న చోట సభలను ఏర్పాటు చేసి బలపడాలనుకుంటోంది బీజేపీ. ఇందులో భాగంగా మొదట కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఏరియాలపై దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో తెలంగాణపై కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అందుకే మొదట ఆ పార్టీని టార్గెట్ చేయాలని నిర్ణయించింది బీజేపీ.













