ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో ఉంచే ఉద్దేశం కేసీఆర్ కు లేదా?
ఈటల రాజేందర్.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్య. టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికొచ్చి బీజేపీలో చేరి హుజూరాబాద్ నుంచి విజయం సాధించి మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అయితే ఆయన్ను అసెంబ్లీలో ఉంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదా అంటే లేదనే సమాధానమే వస్తోంది. ఆయన గెలిచిన తర్వాత తొలిసారి అసెంబ్లీ జరుగుతోంది. అది కూడా మూడు రోజులపాటే. ఇందులో కూడా తొలిరోజు మాత్రమే ఈటల రాజేందర్ సభలో ఉన్నారు. అదే రోజు ఆయన చేసిన ఓ కామెంట్ ఇప్పుడు ఆయన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసేందుకు కారణమైంది.
స్పీకర్ మర మనిషిలా వ్యవహరిస్తున్నారంటూ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. మర మనిషి అనే వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రెండో రోజు సభకు ఈటల రాజేందర్ వస్తే ఆయన నుంచి క్షమాపణ చెప్పించుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ వేసింది. అయితే ఆయన నిన్న సభకు రాలేదు. ఇవాళ మూడో రోజు సభకు ఈటల రావడంతో టీఆర్ఎస్ నేతలు క్షమాపణకు పట్టుబట్టారు. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈటలపై సస్పెన్షన్ విధించాలని ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
అయితే క్షమాపణ చెప్పేందుకు ఈటల ససేమిరా అన్నారు. తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు. తనను బెదిరించడం సరికాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని స్పష్టం చేశారు. సభలో తనను ఉంచే ఉద్దేశం కనిపించడం లేదని.. స్పీకర్ కొడుకుకు ఉన్నంత వయసు కూడా తనకు లేదన్నారు. వెంటనే ఈటల రాజేందర్ ను స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీ నుంచి బయటకు రాగానే ఈటల రాజేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శామీర్ పేటలోని తన నివాసానికి తరలించారు.
ఈటల రాజేందర్ విషయంలో మొదటి నుంచి వివాదం రగులుతూనే ఉంది. ఈటల రాజేందర్ చేసిన మరమనిషి అనే కామెంట్ అన్ పార్లమెంటర్ లాంగ్వేజ్ కాదని.. రాజ్యాంగంలో ఎక్కడా ఆ పదం నిషేదించబడలేదని మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ వ్యాఖ్యానించారు. దీనిపై అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాజ్యాంగంలో ఎక్కడ ఉందో చెబితే తెలుసుకుంటామన్నారు. అయితే రఘునందన్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఈటల సభకు వస్తే ఇదే అంశంపై చర్చకు పట్టుబట్టి సస్పెండ్ చేయించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావించారు. ఇప్పుడు అలాగే జరిగింది.
ఇప్పుడే కాదు. ఇకపైన కూడా అసెంబ్లీలో ఈటల రాజేందర్ ను సభలో ఉంచడం కష్టమేననేది విశ్లేషకుల మాట. సీఎం కేసీఆర్.. ఈటల రాజేందర్ ను సభలో చూడాలనుకోవట్లేదనేది వారి అంచనా. అదే నిజమైతే ఇకపైన కూడా ఇలాంటి పరిణామాలే కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు విధించిన సస్పెన్షన్ ను ఇలాగే కంటిన్యూ చేయొచ్చు. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో!













