రాములమ్మ ట్వీట్ల వెనక….?
బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ విజయశాంతి ట్వీట్లు … కమలం పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. వరుస ట్వీట్లతో సొంతపార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారంటూ.. కొందరి తీరును ట్వీట్ల ద్వారా రాములమ్మ తప్పుపట్టారు. ఇప్పటికైనా వారు తమ పద్ధతి మార్చుకోవాలంటున్నారు. ఇంతకూ రాములమ్మ ఎవరిని టార్గెట్ గా చేసుకుని ట్వీట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం విజయశాంతి వ్యవహారం వాత పెట్టి.. వెన్న పూసిన మాదిరిగా ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ను ఉద్దేశించే విజయశాంతి ట్వీట్స్ చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. బండి సంజయ్ సైతం… కొందరు ఫిర్యాదులు చేస్తూ, తమ పనికి అడ్డం తగిలారని పబ్లిగ్గా చెప్పారు. కిషన్ రెడ్డినైనా తన పని తాను చేసుకునేందుకు సహకరించాలని సభ సాక్షిగా విజ్ఞప్తి చేశారు. దాన్ని ఉటంకిస్తూ విజయశాంతి సైతం… ట్వీట్లు చేస్తున్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ మంచి విజయాలు సాధించాలని కోరుకుంటునట్లు తెలిపారు.
అంతే కాదు…మణిపూర్ ఘటనపై కూడా విజయశాంతి ట్విటర్ వేదికగా కాస్త ఘాటుగానే స్పందించారు. మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో … ఆ రాష్ట్రంలో జరుగుతున్న దారుణ ఘటనలపై బీజేపీ కీలక నేతలెవ్వరూ పెదవి విప్పడం లేదు. విజయశాంతి మాత్రం అక్కడి బీజేపీ ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. మణిపుర్లో జరుగుతున్న సంఘటనలు యావత్ దేశాన్ని త్రీవ్ర వేదనకు గురిచేస్తున్నాయన్నారు. సభ్యసమాజం సిగ్గుతో బాధపడుతోందని రాములమ్మ తెలిపారు. అంతేకాకుండా మహిళలను నగ్నంగా ఊరేగించిన నేరస్థులను ఉరి తీసి శిక్షించాలని డిమాండ్ కూడా చేశారు. మొత్తానికి విజయశాంతి సొంత పార్టీపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే రాములమ్మ సైతం పార్టీలో కీలకపదవి ఆశించారని.. తీరా దక్కకపోవడంతో ఈ విధంగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయాలూ కమలం పార్టీలో ఉన్నాయి. దీనికి తోడు ఆమె పార్టీ మారేయోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఒక్కసారిగా రాములమ్మ స్వరం ట్వీట్ల రూపంలో బయటకు వినిపిస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటిపై రాములమ్మ ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ.. బీజేపీ క్యాడర్, అభిమానుల్లో కనిపిస్తోంది.













