ఇవేం పొత్తులు పవనూ..!? పార్ట్ టైమ్ పాలిటిక్స్ లాగా..!!
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. అందుకే దేశం మొత్తం ఇక్కడి పాలిటిక్స్ పై చర్చించుకుంటూ ఉంటుంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే సత్తా. జాతీయ పార్టీల ప్రభావం అంతంతమాత్రమే. ప్రాంతీయ పార్టీలే అయినా వాటిని ఏమాత్రం చిన్నచూపు చూడ్డానికి వీల్లేదు. జాతీయ పార్టీలను శాసించగలిగే సత్తా వాటింది. ఇప్పుడు బీజేపీ – జనసేన మధ్య పొత్తు కూడా అలాంటిదేనని చెప్పొచ్చు. అయితే వీళ్ల బంధం మాత్రం వెరైటీ. ఏపీలో పొత్తు ఉంటుంది.. కానీ తెలంగాణలో ఉండదు. తెలంగాణలో కూడా ఒక చోట ఉంటుంది.. కానీ మరో చోట ఉండదు. అందుకే వెరైటీ అని చెప్పేది.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన – బీజేపీ బాగా కలిసి పనిచేస్తున్నాయి. రెండు పార్టీల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. పార్టీ అధినేతలు పవన్ కల్యాణ్, సోము వీర్రాజు మధ్య మంచి సంబంధాలున్నాయి. అందుకే అక్కడ పొత్తు సజావుగా సాగుతోంది. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసి పనిచేశాయి. తిరుపతి ఉపఎన్నికల్లో కూడా సహకరించుకున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం రెండు పార్టీల మధ్య గ్యాప్ ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన కలిసి పోటీ చేయాలనుకుంది. కానీ బీజేపీ పెద్దలు కొందరు పవన్ ను కలిసి మద్దతివ్వాలని కోరారు. దీంతో పవన్ కల్యాణ్ పోటీ నుంచి తప్పుకుని బీజేపీకి మద్దతిచ్చారు. అయితే ఆ తర్వాత బీజేపీ పెద్దలు కొందరు జనసేన పొత్తు మేం అడగలేదని.. మాకు వాళ్ల పొత్తు అక్కర్లేదని మాట్లాడారు. దీంతో జనసేనాని పవన్ కల్యాణ్ హర్ట్ అయ్యారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు తెలిపారు. దీంతో తెలంగాణలో బీజేపీ – జనసేన మధ్య పొత్తు ఉండదని అందరూ భావించారు.
అయితే.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచింది. అయితే రాష్ట్రమంతటా కాదండోయ్.. కేవలం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మాత్రమే. ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు స్థానాలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు జనసేన కూడా తమకు ఖమ్మంలో మంచి పట్టుందని భావిస్తోంది. అందుకే ఖమ్మంపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే ఖమ్మంలో జనసేన పోటీ పడితే తమ గెలుపుపై ప్రభావం పడుతుందనుకున్న బీజేపీ.. జనసేనతో మాట్లాడి పొత్తు పొడిచేలా చేసుకుంది. కానీ వరంగల్ లో మాత్రం ఎవరికి వారే..!
అయితే.. ఖమ్మంలో పొడిచిన పొత్తు వరంగల్ లో ఎందుకు వర్కవుట్ కాలేదనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. వరంగల్ లో జనసేన కంటే తామే బలంగా ఉన్నామని బీజేపీ భావించిందా.. అందుకే జనసేన సపోర్ట్ తమకు అక్కర్లేదని భావించిందా.. అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వరంగల్ లో పొత్తు వర్కవుట్ కాకపోవడంతో జనసేన 17 స్థానాల్లో బరిలోకి దిగింది. మరి ఈ స్థానాల్లో బీజేపీపై జనసేన ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఏదైతేనేం.. బీజేపీ, జనసేన పార్ట్ టైమ్ పొత్తులు మాత్రం ఇప్పుడు తెలంగాణలో అత్యంత ఆసక్తిగా మారాయి.













