తెలంగాణ కోసం బీజేపీ హైకమాండ్ పక్కా ప్లాన్..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఇంతకాలం పెద్దగా పట్టించుకోని బీజేపీ ఇప్పుడిప్పుడే స్పీడ్ పెంచుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పోల్చితే చాలా వెనుకబడ్డామనే ఫీలింగ్ బీజేపీలో ఉంది. అయితే ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ కూర్చునేంత సమయం లేదు. అందుకే వాటన్నిటినీ పక్కన పెట్టి ఎన్నికలకోసం పని చేయాలనే లక్ష్యంతో బరిలోకి దగబోతోంది తెలంగాణ బీజేపీ. బీజేపీ నేతలకు హైకమాండ్ ఈ మేరకు దిశానిర్దేశం చేసింది. ఎన్నికలకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులకు జిల్లాలవారీగా బాధ్యతలు అప్పగిస్తోంది.
ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా వాటికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడం బీజేపీ ప్లాన్. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఈ ప్లాన్ కాస్త ఆలస్యం అయింది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది బీజేపీ హైకమాండ్. అందుకే 26 మందితో తెలంగాణ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో దేశవ్యాప్తంగా కీలకంగా ఉన్న పలువురు నేతలకు చోటు కల్పించింది. 5 రాష్ట్రాలకు చెందిన అగ్ర నేతలు కూడా ఇందులో ఉన్నారు. తెలంగాణను ఐదు క్లస్టర్లుగా విభజించిన బీజేపీ.. కమిటీ సభ్యులకు ఆ మేరకు బాధ్యతలు అప్పగించనుంది. ఒక్కో సభ్యుడికి ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాలను అప్పగించే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికల కమిటీలో ఏపీ నుంచి సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి స్థానం లభించింది. కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, శోభా కరంద్లాజే, ధర్మేంద్ర ప్రధాన్, భగవంత్ ఖుబా కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రులు కట్టా సుబ్రమణ్యం నాయుడు, పొన్ రాధాకృష్ణన్, ఎంపీ పీసీ మోహన్, కర్నాటక మాజీ మంత్రి సుధాకర్ తదితరులు కూడా కమిటీలో ఉన్నారు. క్లస్టర్ల వారీగా కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించనున్నారు. వాళ్లకు అప్పగించిన నియోజకవర్గాల్లో బీజేపీ బలం ఎంత, అభ్యర్థి బలహీనతలేంటి.. విపక్షాల పరిస్థితి ఏంటి.. లాంటి అనేక అంశాలను కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తుంటారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అందులో బాగంగా మోదీ, అమిత్ షా, నడ్డాల బహిరంగ సభలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇకపై ప్రతి నెలా వీళ్ల ముగ్గురి బహిరంగసభలు ఏర్పాటు చేసేలా రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే నెల 1, 3 తేదీల్లో మోదీ పర్యటించబోతున్నారు. 6న నడ్డా రాబోతున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా హైకమాండ్ పర్యటనలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ రచిస్తున్నారు. మరోవైపు ఎన్నికల కమిటీలోని 26 మంది సభ్యులు అక్టోబర్ 5 నుంచి పూర్తిగా తెలంగాణలోనే మకాం వేయాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.













