Revanth Reddy: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ను స్మరించుకుంటూ సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి, ఆయన దేశానికి అందించిన విశేష సేవలను కొనియాడారు. ప్రపంచానికి గర్వకారణమైన ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ నిలిచారని, ఆయనతో సమానంగా పోటీ చేయగల నాయకులు ఇప్పటికీ లేనిదని పేర్కొన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం సాకారమైన విషయాన్ని గుర్తుచేశారు.
ఆర్థిక సంస్కరణలకు రూపకర్తగా పేరుపొందిన మన్మోహన్ సింగ్, భూసేకరణ చట్టం సవరణ వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు అని కొనియాడారు. “మన్మోహన్ సింగ్ అందరికీ ఆర్థిక రూపశిల్పి అయితే, తెలంగాణకు ఆత్మబంధువు,” అని వ్యాఖ్యానించిన రేవంత్, తెలంగాణ ప్రజల హృదయాలలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.
సభలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి, ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో మన్మోహన్ సింగ్‌కు ఉన్న బంధం విడదీయరానిదని, ఆయన సేవలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.
మాజీ ప్రధాని విగ్రహాన్ని ఫైనాన్స్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ ప్రతిపాదనకు సభ్యుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధమని తెలిపారు. విగ్రహావిష్కరణతో మన్మోహన్ సింగ్ సేవలను మరింత గౌరవించడమే కాకుండా, ఆర్థిక రంగంలో ఆయన కల్పించిన మార్పులను గుర్తుచేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్ఎస్ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనకు తమ సంపూర్ణ మద్దతు ఉందని కేటీఆర్ స్పష్టంచేశారు. కేంద్ర కేబినెట్‌లో ఆయనతో కలిసి పనిచేసిన కేసీఆర్ అనుభవాలను గుర్తుచేసిన కేటీఆర్, మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు అపారమని ప్రశంసించారు. తెలంగాణ గడ్డపై మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సముచితమని, ఆయన సేవలను ఎప్పటికీ స్మరించుకోవాలని అసెంబ్లీ సభ్యులు తీర్మానించారు.