బర్రెలక్క… చరిత్ర సృష్టిస్తుందా..?
తెలంగాణ ఎన్నికల్లో యువత పెద్దసంఖ్యలో పోటీ చేస్తోంది. ఈసారిపోటీలో పెద్దసంఖ్యలో యువత బరిలోకి దిగుతుండడం సమాజాన్ని ఆలోచనకు గురిచేస్తోంది. డాక్టర్లు, ఇంజినీర్లు, సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులు పోటీ చేస్తున్నారు. దీంతో యువతను ఆకట్టుకోవడంపై వారు దృష్టి పెట్టారు. అయితే వీరందరూ… నిరుద్యోగ యువతపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతను ఎలా ప్రసన్నం చేసుకోవాలా అన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు. ప్రచారపర్వంలో తమ ప్రాధాన్యాలను వివరిస్తున్నారు.
అయితే వీరిలో బాగా పాపులర్ అయింది బర్రెలక్క. డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే గేదెలు కాస్తూ బతుకుతున్నానంటూ గతంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది కర్నె శిరీష. ఆ పోస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ పెద్దకొత్తపల్లి పోలీసులు అప్పట్లో కేసు సైతం నమోదు చేశారు. అయితే ఇటీవల ఎన్నికల సందర్భంగా ఆ వీడియో బాగా పాపులర్ అయింది. ఎంతగా అంటే.. ఆమెకు లక్షా 60 వేల మంది సబ్ స్క్రైబర్స్ వచ్చేంతగా పాపులర్ అయింది.
ప్రస్తుత ఎన్నికల్లో ఆమె నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. శిరీష అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీకాం పూర్తి చేశారు. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయడానికి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. మ్యానిఫెస్టోనూ విడుదల చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు పోరాటం చేస్తానని ప్రచారం చేస్తున్నారు. ఆమెను ప్రస్తుతం యూట్యూబ్లో 1.66 లక్షల మంది, ఇన్స్టాగ్రామ్లో 5.97 లక్షల మంది, ఫేస్బుక్లో 1.12 లక్షల మంది అనుసరిస్తున్నారు. తన బ్యాంకు ఖాతాలో రూ.1,500, చేతిలో మరో రూ.5,000 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
అయితే.. శిరీషకు పెద్దఎత్తున యువతలో ఆదరణ లభిస్తోంది. ఆమె పోరాటాన్ని తమదిగా భావిస్తున్న యువత…బర్రెలక్కకు సపోర్టు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ప్రజలకు సంబంధం లేకుండా… మజిల్, మనీపవర్ తో సాగుతున్న ఈఎన్నికల్లో బర్రెలక్క గెలిస్తే… అది చాలా మంది యువతకు మార్గదర్శకంగా మారుతుందన్న ఆలోచనతో….పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాదు.. యానాం ఎమ్మెల్యే మల్లాది లాంటి వారు సాయమందిస్తూ, అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన శిరీషకు.. తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. శిరీష తల్లి పెద్దకొత్తపల్లిలో ఫాస్ట్ఫుడ్ కేంద్రాన్ని నడుపుతున్నారు. వీరి కుటుంబానికి అదే జీవనాధారం.













