బండ్ల గణేష్ సంచలన నిర్ణయం..!!
నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్ గురించి తెలియని వారుండరు. తనదైన మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. తన కామెంట్స్ తోనే ఆయన సూపర్ పాపులర్ కూడా అయ్యారు. నటుడిగా, నిర్మాతగా సినీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు బండ్ల గణేష్. పవన్ కల్యాణ్ కు వీరాభిమానిగా చెప్పుకుంటారాయన. అయితే ఇటీవల గురూజీ తనను దేవుడు పవన్ కల్యాణ్ కు దూరం చేసాడంటూ ట్వీట్లు చేసి సంచలనం సృష్టించారు. ఇలాంటి ట్వీట్లు బండ్ల గణేశ్ కు కొత్త కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేశ్.. నిత్యం ట్వీట్లు, పోస్టులతో చర్చనీయాంశంగా మారుతుంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ మరో సంచలనానికి కారణమవుతోంది.
2018 ఎన్నికల సమయంలో బండ్ల గణేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన షాద్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఓడిపోతే 7’O క్లాక్ బ్లేడుతో గొంతుకోసుకుంటానంటూ చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద సంచలనానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత బండ్ల గణేశ్ మాట మార్చారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా దూరంగా ఉండిపోయారు. తన వ్యాపారాల్లో బిజీ అయిపోయారు. రాజకీయాలు ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. దీంతో ఆయన ఇక రాజకీయాల్లోకి రారనుకున్నారు.
అయితే ఇప్పుడు మళ్లీ ఆయనకు రాజకీయాలపై మనసు పడినట్లుంది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తాను పాల్గొనబోతున్నట్టు బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. అన్నా.. నేను వస్తున్నా.. అడుగులో అడుగు వేస్తా.. కాంగ్రెస్ పార్టీని అదికారంలోకి తీసుకువచ్చేందుకు మీకు నా వంతు సాయం చేస్తా.. అని బండ్లగణేష్ ప్రకటించారు. అంతేకాక జై కాంగ్రెస్, జైజై కాంగ్రెస్ అని ముక్తాయించారు. దీంతో ఆయనకు మళ్లీ కాంగ్రెస్ పార్టీపై మనసు మళ్లిందని అందరూ భావిస్తున్నారు. ఇటీవలికాలంలో కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీదుంది. దీంతో సైలెంట్ గా ఉన్న నేతలు, ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలు కూడా మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఇప్పుడు బండ్ల గణేశ్ కూడా ఆ కోవకే చెందుతారు.
ఆ మధ్య కాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అనుకూలంగా ట్వీట్లు చేశారు బండ్ల గణేశ్. మీ పరిపాలన సూపర్ అని కొనియాడరు. మీ ముందు చూపును, పరిపాలనా దక్షతను అర్థం చేసుకోలేకపోయానని ఆవేదన చెందారు. దీంతో ఆయన అధికార పార్టీలోకి వెళ్తారేమోనని భావించారు. అయితే ఆ తర్వాత మళ్లీ కామ్ అయిపోయారు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ట్వీట్లు చేయడం.. భట్టి పాదయాత్రలో పాల్గొంటున్నట్టు ప్రకటించడం.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుతు తనవంతు సాయం చేస్తానని చెప్పడం.. ఇవన్నీ చూస్తుంటే బండ్ల గణేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు అర్థమవుతోంది. మరి ఈసారైనా ఆయనకు టికెట్ దక్కుతుందా.. లేదా.. అనేది వేచి చూడాలి.













