బీసీలకు సీఎం కేసీఆర్ ఏం ఇచ్చారు ? : బండి సంజయ్
రాష్ట్రంలోని బీసీలకు గొర్రెలు, బర్రెలు తప్ప సీఎం కేసీఆర్ ఏం ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్లో బీజేపీ ఓబీసీ సమ్మేళానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం మంది బీసీలుంటే మంత్రివర్గంలో ముగ్గురికే మంత్రి పదవులు ఇచ్చి రాజకీయంగా అణగదొక్కారని ఆరోపించారు. ఎన్నికలు వస్తే తప్ప కేసీఆర్కు ఆత్మ గౌరవ భవనాలు గుర్తుకు రావని దుయ్యబట్టారు. రూ.1600 కోట్లతో సచివాలయం మాత్రం పూర్తి చేసుకున్నారని, ఇప్పటివరకు బీసీ ఆత్మ గౌరవ భవనాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్, అభివృద్ధికి మాత్రం కేసీఆర్ ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టదని దుయ్యబట్టారు. బీసీ బంధు ప్రకటించేందుకు ఉన్న ఇబ్బంది ఏంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.













