ఎమ్మెల్యేకు ఎర కేసులో జడ్జి నిర్ణయం హర్షనీయం: బండి సంజయ్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయం హర్షనీయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్న ఉత్తర్వులను మేము స్వాగతిస్తున్నామని బండి అన్నారు. ఈ నేపథ్యంలో బండి ఓ ప్రకటన చేశారు. ‘ఎమ్మెల్యేల కేసులో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరిపించాలన్నదే బీజేపీ అభిప్రాయం. హైకోర్టు నిర్ణయంతో ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కేసీఆర్ ప్రెస్మీట్ నిర్వహించడమే నిదర్శనం’ అని బండి చెప్పుకొచ్చారు. అంనతరం కేసీఆర్ ప్రెస్మీట్పై హైకోర్టు వ్యాఖ్యలు అభినందీయమని, సిట్ విచారణ పురోగతి వివరాలను బహిర్గతం చేయకూడదని, ఈ నెల 29లోపు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో ధర్మాసనానికి సమర్పించాలన్న హైకోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. తప్పు, కుట్ర చేసిన వారికి శిక్ష పడాలి, రాష్ట్ర ప్రజలు కోరిక కూడా అదే, హైకోర్టు నిర్ణయాలు, తీర్పు పట్ల తమకు అపార నమ్మకం ఉందని, వాస్తవాలు త్వరలో వెలుగులోకి వస్తాయని, ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర వెనుక ఉన్న సూత్రధారులెవరో తేలుతుందని, దోషులకు శిక్ష తప్పదన్న నమ్మకం తమకు ఉందని బండి వెల్లడించారు.













