కమలంలో కల్లోలం..
పార్టీ అధ్యక్షపదవి నుంచి బండిసంజయ్ తొలగింపుతో కమలంలో ఏర్పడిన సంక్షోభం కొనసాగుతోంది. నూతన అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించిన సమయంలో.. ఆవిషయం మరోసారి బహిర్గతమైంది. చీటికి, మాటికి ఢిల్లీ వెళ్లి తనపై జాతీయ నాయకత్వానికి కొందరు ఫిర్యాదులు చేశారని.. మాజీ అధ్యక్షుడు బండిసంజయ్ ఆరోపించారు. ఇకనైనా అలాంటి వాటిని మానుకోవాలని హితవు పలికారు. కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని సూచించారు.
బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సమయంలో.. ఆయనను చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆ సమయంలో బాత్రూంకి వెళ్లి ఏడ్చానంటూ ఆవేదను వ్యక్తం చేశారు. బండి సంజయ్ విషయంలో తనకు బాధ కలిగిందని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నుంచి విజయశాంతి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఈ ఘటన పార్టీ వర్గాల్లో చర్చకు దారితీయడంతో.. ఆమె ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రయత్నించినవారు ఎవరైనా ఉన్న సందర్భంలో అక్కడ ఉండడం అసౌకర్యం.. అసాధ్యం’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి హాజరైన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించే విజయశాంతి ఈ వ్యాఖ్య చేసి ఉంటారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కొత్త అధ్యక్షుడి రాకతో అయినా అందరునేతలు ఏకతాటిపైకి వస్తారని భావించిన కమలం పార్టీ కార్యకర్తలకు.. తాజా పరిణామాలు మరింత ఆవేదన కలిగిస్తున్నాయి. పిడికెడు మంది నాయకులు, తమ మధ్య ఉన్న అభిప్రాయభేదాల్ని పరిష్కరించుకోకుంటే.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో పోరు ఎలా సాధ్యమని కేడర్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నేతలు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుతున్నారు.













