Revanth Reddy: రేవంత్ సర్కార్ రైతులకు అన్యాయం చేస్తుంది.. మంత్రి బండి సంజయ్ ఫైర్..

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై బీజేపీ (B.J.P) నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర విమర్శలు చేశారు. “ఇందిరమ్మ భరోసా” పేరుతో రైతులకు ఎకరాకు రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు రూ.12వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తూట్లు పొడుస్తూ, ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు నేటి ప్రకటనకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని, రైతులను దగా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. రైతు భరోసా(Rythu Bharosa) చెల్లింపులు ఏడాది పాటు నిలిపివేయడంతో రైతులకు తీవ్ర నిరాశ మిగిలిందని, గత ఏడాది చెల్లింపుల బకాయిలు ఇవ్వాలని రైతులు ఆశించినా, వాటిని విభజించి రాబోయే నాలుగేళ్లలో మాత్రమే చెల్లించాలన్న నిర్ణయం న్యాయబద్ధం కాదని విమర్శించారు.
అంతేకాక, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పి ఆ వర్గాలను పూర్తిగా విస్మరించారని బండి సంజయ్ అన్నారు. “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” (Indirama Athmiya Bharosa) పేరుతో ఎంత మంది రైతులకు ఎంత మొత్తాన్ని చెల్లిస్తారో స్పష్టత లేకపోవడం విడ్డూరమన్నారు. రైతు బంధు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది రైతులకు అన్యాయమని ఆరోపించారు.
రుణమాఫీ పేరిట 46 లక్షల మంది రైతులకు చెల్లింపులు చేస్తామన్న హామీ ప్రకారం 22 లక్షల మందికి మాత్రమే సాయం చేశారని, అన్నిరకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి చివరికి కొద్దిమంది రైతులకే ప్రయోజనం కల్పించారని విమర్శించారు. రైతు సంక్షేమం అంటే హామీలను తప్పించడమేనా అని ప్రశ్నించారు.
కేవలం 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడిచినా వాటిని అమలు చేయకపోవడం పేదలకు తీవ్ర నష్టమని బండి సంజయ్ అన్నారు. మహిళలకు రూ.2500, వృద్ధులకు రూ.4000 పెన్షన్, నిరుద్యోగ భృతి, ఇల్లు లేని పేదలకు భూమి, ఆర్థిక సాయం వంటి హామీలను అమలు చేయకపోవడం పేదల బతుకులను మరింత కష్టాల్లోకి నెట్టిందని ఆయన విమర్శించారు. ఇలాంటి వైఖరితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం కష్టమని, రైతుల కష్టాలను పరిష్కరించకుండా వారి నమ్మకాన్ని ద్రోహం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారని ఆయన మండిపడ్డారు.