మళ్లీ బాబాయ్ వర్సెస్ అబ్బాయ్..?
ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమం సందర్భంగా మరోసారి నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కుటుంబసభ్యులు ఎవరికి వారే వచ్చి నివాళులు అర్పిస్తూ వెళ్తున్నారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ .. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్కు నివాళులు అర్పించేందుకు ఘాట్ దగ్గరకు వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో .. ఘాట్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ అభిమానులు .. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు . దీంతో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, కటౌట్లను సిబ్బంది తొలగించారు. అయితే బాలకృష్ణ ఆదేశాలతోనే వీటిని తొలగించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ గొడవ తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు.
గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ టిడిపికి దూరంగా ఉన్నారు. పార్టీకి అనుకూలంగా ఏ ప్రకటన చేయడం లేదు. విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు, చంద్రబాబు భార్య భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు, చంద్రబాబు కంటతడి పెట్టడం వంటి అంశాలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై టిడిపి శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను తమ వాడిగా చెప్పుకుంటాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తప్పించి.. టిడిపి శ్రేణులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పై మండిపడుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై 50రోజులకు పైగా జైల్లో ఉన్నప్పటికీ, చంద్రబాబు అరెస్ట్ పై కూడా తారక్ స్పందించలేదు. ఒక్క ప్రకటన కూడా చేయలేదు. దీనిపై ఆ మధ్యన బాలకృష్ణ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఐ డోంట్ కేర్ అంటూ సంబోధించారు. దీంతో వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సమయంలో తాజాగా ఫ్లెక్సీల వివాదం అలుముకుంది. బాలకృష్ణ సూచనతోనే ఫ్లెక్సీలను తొలగించారని తారక్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అటువంటిదేమీ లేదని బాలకృష్ణ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల టిడిపి సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి అదే తరహా ఫ్లెక్సీ వివాదం తెరపైకి రావడం విశేషం.
ఏదేమైనా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు తొలగించడం నీచాతినీచమన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. మొదట బావ కోసం, ఇప్పుడు అల్లుడి కోసం.. కుటుంబానికి ద్రోహం చేస్తున్నారని బాలకృష్ణపై ఫైరయ్యారు. ఎవరేం చేసినా జూనియర్ ఎన్టీఆర్ను ఏం చేయలేరని తనదైనశైలిలో సెటైర్లు వేశారు.జూనియర్ ఎన్టీఆర్కు కొడాలి నాని ఎంత దగ్గరి వ్యక్తో అందరికీ తెలుసు. అలాంటి నాని..మరోసారి ఎన్టీఆర్ కుటుంబసభ్యులను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది.
మరోవైపు ఇటీవలే కల్యాణ్ రామ్ కూడా..ఈదఫా ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తామో త్వరలోనే చెబుతామంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఏపార్టీకి మద్దతిస్తామన్నది తన ఒక్కరి నిర్ణయంపై ఆధారపడి ఉండదన్నారు. కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు కల్యాణ్ రామ్. తాను గానీ, జూనియర్ ఎన్టీఆర్ కాని వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోమని చెప్పారు. నాన్న లేకపోవడం వల్ల కుటుంబ పెద్దగా ఉంటున్నామని.. ఇద్దరం కలిసి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు కల్యాణ్ రామ్. దీంతో ఈ విషయం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది.













